ఏడాది లోపు పనులు పూర్తి చేయాలి
బమ్మెరను మరో బాసరగా తీర్చిదిద్దుతా
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తా
టూరిజం అభివృద్ధి పనులపై సమీక్షలో
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పాలకుర్తి రూరల్, జనవరి 8 : చారిత్రక ప్రసిద్ధిగాంచిన పాలకుర్తి, బమ్మెర, వల్మిడిలో చేపట్టిన టూరి జం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. నిధులు సరిపోకుంటే అదనంగా మంజూరు చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో పర్యాటక ప్రాంతాల పనుల పురోగతిపై జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలకుర్తిలో సోమనాథుడి స్మారక స్తూపం, కల్యాణ మండపం, బమ్మెరలో పోతన స్మారక మందిరం, సరస్వతి అక్షరాభ్యాస మందిరం, వల్మిడిలోని దేవాలయ అభివృద్ధి పనులతో పాటు పాకశాల, విద్యుద్దీకరణ, నీటి వసతి పనులపై ఎర్రబెల్లి సమీక్షించారు. ఆనంతరం మండల కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయ పనులు, రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవనానికి స్థల పరిశీలన చేశారు. వల్మిడి గుట్టపై చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ బమ్మెరను మరో బాసరగా తీర్చిదిద్దుతానన్నారు. సీఎం కేసీఆర్కు నచ్చిన ప్రాంతం, మెచ్చిన కవి బమ్మెర పోతన అని కొనియాడారు. ఏడాదిలోపు పనులను పూర్తి చేస్తే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పర్యాటక పనులను ప్రారంభిస్తానన్నారు. అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వల్మిడి ఆలయ అభివృద్ధిలో భాగంగా గుట్టపైకి రోడ్డు కోసం ప్రత్యేక నిధుల నుంచి రూ.కోటి మంజూరు చేశానన్నారు. పాలకుర్తికి రూ.10 కోట్లు, వల్మిడికి రూ.5 కోట్లు, బమ్మెరకు రూ.7.50 కోట్లు మంజూరు చేశామన్నారు. సీఎం కేసీఆర్ బమ్మెరకు ప్రత్యేకంగా వచ్చినప్పుడు జిల్లాలో టూరిజం పనులకు రూ.40 కోట్లు మంజూరు చేశారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. పనుల్లో పురోగతి పెంచి నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని ఆయన అధికారులను కోరారు.
సోమేశ్వరాలయ అభివృద్ధికి కృషి
పాలకుర్తిలో హరిహరుల పుణ్యక్షేత్రమైన సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణకు సీసీ రోడ్డు వేశామన్నారు. వల్మిడిలో వచ్చే శ్రీరామ నవమిలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతానన్నారు.