వసతి గృహాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలి
జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
ఎస్సీ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు
భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 10 : ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఎస్సీ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఎస్సీ హాస్టల్ సంక్షేమ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులు అందిస్తున్న సౌకర్యాలపై సమీక్షించారు. జిల్లాలో 15 ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలు ఉన్నాయని, వాటిలో 413 మంది విద్యార్థులు ఉంటున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుపేద ఎస్సీ విద్యార్థులు చాలా మంది ఉన్నారని, 15 ఎస్సీ వసతి గృహాల్లో కనీసం 1,500 మంది విద్యార్థులు ఉండాలన్నారు. కానీ, 413 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని వసతులపై అవగాహన కల్పించి ప్రవేశాలు పొందేలా చూడాలన్నారు. గోడలపై దేశభక్తి, మంచి సూక్తులు రాయించాలని కలెక్టర్ సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ట్యూషన్లు చెప్పించాలని, ముఖ్యంగా వసతి గృహాల్లో విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ప్రతినెలా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ సూపరింటెండెంట్, సిబ్బంది, వసతి గృహాల సంక్షేమ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.