తొలి విడుత 9, రెండో విడుత 19 దవాఖానలు
వైద్య, ఆరోగ్య శాఖకు ప్రతిపాదనలు
మంత్రి హరీశ్‌రావు నగర పర్యటనలో ప్రారంభం
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
వరంగల్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదలకు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అన్ని రకాల జబ్బులను ప్రారంభంలోనే గుర్తించి వెం టనే చికిత్స అందించేందుకు వీలుగా బస్తీ దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే బస్తీ దవాఖానలు పేదలకు వైద్య సేవలను అందిస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా ఉన్న గ్రేటర్ వరంగల్లోనూ బస్తీ దవాఖానలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నా యి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బస్తీ దవాఖానల నిర్వహణ కు అంతా సిద్ధం చేశారు. వైద్య, ఆరోగ్య మంత్రి టీ హ రీశ్‌రావు త్వరలోనే వరంగల్ పర్యటనకు రానున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల ప్రారంభం, ఎంజీఎంలో వైద్య సేవల తీరును పరిశీలించేందుకు వస్తున్నా రు. ఈ పర్యటనలోనే బస్తీ దవాఖానలను ప్రారంభించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నగర పరిధిలో 28 బస్తీ దవాఖానాలను ఏర్పాట చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు తొలి దశలో 9బస్తీ దవాఖానలను ప్రారంభించేలా వైద్య, ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది. దశల వారీగా మిగిలిన వాటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇంటి దగ్గరే వైద్యం..
పేదలకు అందుబాటులో ఉండేలా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తారు. బస్తీ దవాఖానలో డాక్టర్, స్టాఫ్ నర్సు, అటెండెంట్ ఉంటారు. ఎలాంటి ఆరోగ్య సమ స్య వచ్చినా వెంటనే వైద్యసాయం అందించేలా బస్తీ ద వాఖానలు ఉంటాయి. బస్తీల్లో అత్యధికంగా ఉండే పేదలకు ప్రభుత్వ పరంగా వైద్య సాయం అందించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. రోజంతా కష్టపడి, సరైన పౌష్టికాహారం తీసుకునే అవకాశం లేకపోవడం తో పేదలు ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నా రు. ప్రతిరోజూ పనిచేయక తప్పని పరిస్థితి ఉండడంతో వీరు చిన్నపాటి ఆరోగ్య సమస్యల కోసం దవాఖానల కు వెళ్లడంలేదు. ప్రస్తుతం ఇంటి దగ్గర ప్రాంతాల్లో ప్ర భుత్వ వైద్య సేవలు అందించే పరిస్థితి లేదు. వైద్యం కోసం వీరు దూర ప్రాంతాలకు వెళ్లడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నగా మొదలైన ఆరోగ్య సమస్యలు తీ వ్రంగా మారుతున్నాయి. అప్పుడు ప్రభుత్వం ఎంత వైద్యసాయం అందించినా ఉపయోగం లేకుండా పో తోంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు పెద్దగా మారకముందే పేదలకు వైద్య సాయం అందించడం లక్ష్యంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటితో పేదలకు ఇంటి దగ్గర వైద్యం ఉందనే న మ్మకం పెరుగుతుంది. ఏ చిన్న సమస్య వచ్చినా వెంట నే వెళ్తారు. చికిత్స తీసుకుంటారు. వారి ఆరోగ్యం మె రుగ్గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే రోజూ పని చేసే వీలుంటుంది. దీంతో వారి ఆర్థికస్థితి మెరుగవుతుంది.
యూపీహెచ్‌సీలకు అనుసంధానం…
గ్రేటర్ వరంగల్‌లో ప్రస్తుతం 17 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(యూపీహెచ్‌సీలు) ఉన్నాయి. సోమి డి, బోడగుట్ట, వడ్డేపల్లి, లష్కర్ సింగారం, పోచమ్మకుంట, హనుమకొండ, పెద్దమ్మగడ్డ, ఎంజీఎం, సీకే ఎం, దేశాయిపేట, కాశీబుగ్గ, కీర్తినగర్, చింతల్, ఖిలావరంగల్, రంగశాయిపేట, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, న్యూశాయంపేట యూపీహెచ్‌సీలు వైద్య సేవలు అందించే ప్రాంతాలకు దూరంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కనీసం ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఇవి ఉంటాయి. ఇ లా దూరంగా ఉండడం వల్ల ఎక్కువ మంది పేదలకు వైద్య సేవలు అందుతాయి. అనారోగ్యంతో బస్తీ దవాఖానాలకు వచ్చిన వారిని అక్కడి డాక్టర్ పరిశీలిస్తారు. వైద్య పరీక్షలు అవసరమైతే దగ్గరలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేలా బస్తీ దవాఖానల సి బ్బంది చర్యలు తీసుకుంటారు. వైద్య పరీక్షల రిపోర్టుల ఆధారంగా ఇంకా మెరుగైన వైద్యం అవసరమైతే ఎంజీ ఎం, పీఎంఎస్‌వై వంటి ఆస్పత్రులకు పంపిస్తారు.