జయశంకర్ భూపాలపల్లి, జనవరి 10 (నమస్తే తెలంగాణ);‘అక్రమాలకు పాల్పడి జైలులో చిప్పకూడు తినాల్సిన మీరు నీతులు చెప్పడమేంటి? కన్సెల్టింగ్ కంపెనీ అసోం, గోవాలో అధికారులు, నాయకులకు ముడుపులు ఇచ్చినట్లు కోర్టులో రుజువైన విషయం నిజం కాదా’ అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై మండిపడ్డారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసోంలో అనేక అక్రమాలు చేసిన హిమంత.. నీతిమంతుడిలా ఇక్కడికి వచ్చి సుద్దులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు 18 ఎకరాల భూమిని కబ్జా చేయడం, 2015లో ముడుపుల వ్యవహారం బయటపడడం, విచారణ అధికారినే సస్పెండ్ చేయించి.. ఆ తర్వాత దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. బీజేపీ నాయకులు రోజుకొకరు వచ్చి సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసిన గండ్ర.. నోటిని అదుపులో పెట్టుకోవాలని ఆ పార్టీ నేతలను హెచ్చరించారు.
అక్రమాలకు పాల్పడి జైలు జీవితం గడపాల్సిన హిమంత బిశ్వశర్మ బీజేపీలో చేరి అసోం ముఖ్యమంత్రి అయి వరంగల్‌కు వచ్చి తానేదో పునీతుడిని అని మాట్లాడుతున్నాడని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గండ్ర విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకులు రోజుకొకరు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోంలో అనేక అక్రమాలకు పాల్పడిన అసోం సీఎం ఇక్కడకు వచ్చిన తానేదో నీతిమంతుడనే ధోరణితో నీతులు వల్లించాడని ఆరోపించారు. నీ చరిత్ర దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. 2001 నుంచి 2015 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసినప్పుడు 2006-2009 మధ్య సీఎం భార్య కంపెనీకి 18 ఎకరాల భూమి అప్పగించినట్లు ఆరోపణలు ఎదుర్కోలేదా అని గుర్తు చేశారు. అమెరికాకు చెందిన బర్డర్ లూయిస్ అనే కన్సల్టింగ్ కంపెనీ అసోం, గోవాలో అధికారులు, నాయకులకు ముడుపులు ఇచ్చినట్లు ఆ దేశ కోర్టులో రుజువైంది నిజం కాదా అని ప్రశ్నించారు. 2015 జూలైలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ విడుదల చేసిన నివేదికలో ముడుపులు తీసుకున్నది హిమంత బిశ్వశర్మ అని పేర్కొన్నట్లు తెలిపారు. 2015 ఆగస్టులో బిశ్వశర్మ బీజేపీలో చేరారని, అనంతరం విచారణ చేస్తున్న అధికారిని సస్పెండ్ చేశారని, నేటి వరకు కేసులో ఎటువంటి పురోగతి లేదన్నారు. గోవాలో మాత్రం విచారణ కొనసాగుతుందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రైతు వ్యతిరేక సాగు చట్టాలను తీసుకు వచ్చి తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయమని చెప్తున్న బీజేపీ దేశాన్ని పాలించే నైతిక హక్కు కోల్పోయిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని అహంకారంతో మాట్లాడుతున్నారని, బీజేపీ నాయకులు తెలంగాణలో కాలుపెట్టే అర్హత కోల్పోయారని అన్నారు.
జాతీయ స్థాయి కూటమి ఆవశ్యకత ఉంది
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పాలించే అర్హత లేదని, వారు ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు. ఆ పార్టీలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారని తెలిపారు. సీపీఎం జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నందున ఆ పార్టీ ముఖ్యమంత్రిని సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తే బీజేపీ నాయకులకు ఎందుకు కడుపుమంట అన్నారు. అతిథులను గౌరవించే సంప్రదాయం లేకపోవడం విచారకరమన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అనుబంధ జాతరలకు నిధులు మంజూరు
మేడారం జాతర సందర్భంగా జిల్లాలోని అనుబంధ జాతరల నిర్వహణకు ప్రభుత్వం రూ.30 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. తాగు నీరు, వైద్యం, రోడ్లు విద్యుత్ వంటి అవసరాల కోసం నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. అవసరమైనచోట మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, కలెక్టర్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జనార్దన్, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్‌రెడ్డి, కౌన్సిలర్లు నూనె రాజు, తిరుపతి, రవీందర్, టీబీజీకేఎస్ నాయకులు కొక్కుల తిరుపతి, సమ్మిరెడ్డి, జిల్లా నాయకులు బర్ర రమేశ్, మందల రవీందర్‌రెడ్డి, సిద్ధు, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతరలో ప్లాస్టిక్ వినియోగించొద్దు
తాడ్వాయి, జనవరి10: వచ్చేనెలలో నిర్వహించనున్న మేడారం సమ్మక్క-సారలమ్మల మహాజాతరలో పాస్టిట్ వినియోగించవద్దని మహబూబాబాద్ జిలా కొత్తగూడ మండలం గుండ్రపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వనప్రేమి, జనప్రేమి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గ్రీన్‌మ్యాన్ డాక్టర్ పులుసం సాంబయ్య అన్నారు. సోమవారం తన గ్రీన్ ఆక్సిజన్ మ్యాన్ గెటప్‌తో మేడారంలో పర్యటించారు. ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఆదివాసీ సమ్మేళన తేదీల ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం అమ్మవార్ల గద్దెల పరిసరాల్లో ఉన్న వ్యాపారులు, భక్తులతో మాట్లాడారు. చెట్లను నరకవద్దని, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించ కూడదని కోరారు. మేడారంలోని ఆదివాసీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాలని కోరుతూ పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, మ్యూజియం అసిస్టెంట్ క్యూరేటర్ కుర్సం రవిలకు ఆదివాసీలు ఉపయోగించిన వెదురు కర్రలతో చేసిన సోల, సొరకాయతో చేసిన నీటి బుర్రను అందజేశారు. అనంతరం అమ్మవార్ల గద్దెల ఆవరణలో గోగ్రీన్, గోమేడారం జాతర అనే క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆయనవెంట పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఆదివాసీ కులపెద్దలు వీరయ్య, శ్రీరాములు, కృష్ణప్రసాద్, అరుణ్‌కుమార్, మహేశ్, సురేందర్, రఘుపతి, ప్రభాకర్, గణేశ్, స్వామి, వెంకట్ తదితరులు ఉన్నారు.