పెట్టుబడి సాయం రూ.50వేల కోట్లు దాటడంపై హర్షం
ఊరూవాడన మిన్నంటిన సంబురం
ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, బైక్ ర్యాలీ జోరు
పంటచేల్లో పాలాభిషేకాలు, పంట ఉత్పత్తులతో రాతలు
ముంగిల్లలో మెరిసిన ‘రైతు’ రంగవల్లుల
ఎవుసం పండుగైందంటూ ఆనందోత్సాహాలు
కదిలివచ్చిన గులాబీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు
ఆడిపాడి మురిసిన అన్నదాతలు
ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా వారోత్సవాలు
రైతుబాంధవుడిపై అభిమాన వర్షం కురుస్తోంది.
వరంగల్, జనవరి 10 (నమస్తేతెలంగాణ) కరువుదీరా నీళ్లిచ్చి, 24గంటల ఫ్రీ కరెంటిచ్చి, అదునుకు పెట్టుబడి సాయంతో ఆసరా అయి వ్యవసాయాన్ని పండుగ చేశాడంటూ.. రైతుబంధు సాయం రూ.50వేల కోట్ల మార్కును దాటిన సందర్భాన్ని టీఆర్ఎస్ నేతలతో కలిసి రైతాంగం వేడుకలా జరుపుకుంటోంది. ఉత్సవాల్లో భాగంగా ఓ వైపు ముంగిల్లలో ‘రైతుబతుకు చిత్రాన్ని’ తెలిపే రంగవల్లులు వేసి, పంటచేల్లో పాలాభిషేకాలు చేసి, మరోవైపు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, బైక్‌ల జోరుగా ర్యాలీ తీసి సీఎం కేసీఆర్‌పై తమకున్న ప్రేమను చాటుకున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉత్సవాల్లో సంబురంగా సాగగా, ఆటాపాటలు, కోలాటాలు.. దారుల వెంట ‘జైకేసీఆర్’, ‘జై రైతుబంధు’ నినాదాలతో ఊరూవాడన మార్మోగించారు. రైతుబిడ్డ కేసీఆర్ ఉండగా.. ‘ప్రతిరోజూ పండుగే’నని సంతోషం వ్యక్తంచేశారు.
పెట్టుబడి సాయం రూ. 50 వేల కోట్లు దాటడంతో ఊరూరా రైతు బంధు సంబురం నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం పెద్దఎత్తున ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. రంగుల హరివిల్లులతో గ్రామాలకు కొత్త కళ వచ్చింది. ఉత్సాహంగా రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుకు జేజేలు పలికారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ అభిమానా న్ని చాటుకున్నారు. హనుమకొండలోని 48వ డివిజన్ దర్గా కాజీపేట రైతు సహకార సంఘం ప్రాంగణం లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. వరంగల్ జిల్లా నర్సంపేట, మాదన్నపేట, కమ్మపల్లి, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, పర్వతగిరి మండలం బట్టుతండా-2లో రైతుబంధు సంబురాలు వేడుకగా సాగా యి. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో 300 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించగా, ఎమ్మెల్యే రెడ్యానాయక్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. గూడూరులో రైతుబంధు ఉత్సవాల్లో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పాల్గొని రైతులను సన్మానించారు. కురవి మండలం మొగిలిచర్లలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. జనగామలో వందలాది ట్రాక్టర్లతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ర్యాలీగా వచ్చి ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పూలు, పాలాభిషేకం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సంబురాల్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని రంగవల్లులను పరిశీలించారు. తరిగొప్పుల, కొడకండ్లలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై రైతులు, కోలాటాలతో మహిళలు, ప్రజాప్రతినిధులు ర్యాలీ తీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహదేవపూ ర్, మహాముత్తారంలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ట్రాక్టర్లతో ర్యాలీ తీసి కృతజ్ఞత చాటుకున్నారు.