పీజీ సీట్ల పెంపునకు ప్రభుత్వం కృషి
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఆయుష్ కమిషనర్, కలెక్టర్‌తో కలిసి అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల సందర్శన
వరగంల్ చౌరస్తా, జనవరి 10 : వరంగల్ జిల్లాను మెడికల్ హబ్‌గా మా ర్చేందుకు మరో అడుగు ముందు కు పడింది. ఆయుర్వేద వైద్యాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు పెద్దదిక్కయిన అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల, కళాశాలను మరింత అభివృద్ధి చేయనున్నట్లు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. సోమవారం ఆయన తెలంగాణ ఆయుష్ విభాగం కమిషనర్ అలుగు వర్షిణి, కలెక్టర్ గోపితో కలిసి సందర్శించారు. ఈ వైద్యశాల, కళాశాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే నరేందర్ మంత్రి హరీశ్‌రావును కోరగా, ఆయన ఆదేశాల మేరకు ఆయుష్ విభాగం కమిషనర్ ఇక్కడకు వచ్చారు. ఆయుర్వేద కళాశాలను పీజీ కళాశాలగా అభివృద్ధి చేయడానికి గల ఆవశ్యకతను వివరించారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనే అతి పెద్ద ఆయుర్వేద విశ్వవిద్యాలయంగా రూపొందించేందుకు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పడకల సంఖ్యనూ పెంచుతామన్నారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. వైద్యశాల, కళాశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం నోడల్ ఆఫీసర్ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు. త్వరలో మరిన్ని రోగాలను తగ్గించేందుకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుతామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, సోమిశెట్టి ప్రవీణ్, వస్కుల బాబు, మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్, అనిల్, ఆయుర్వేద వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీందర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.