సుబేదారి, జనవరి 10: హనుమకొండ సుబేదారిలోని రోహిణి హాస్పిటల్ నర్సింగ్ విద్యార్థిని రవళి(19) తుది శ్వాస విడిచింది. ఎల్కతుర్తి మండలం గోపాల్పురం గ్రామానికి చెందిన కాందారపు రవళి మూడు రోజుల క్రితం హంటర్‌రోడ్డులోని రోహిణి హాస్పిటల్ నర్సింగ్ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్సకోసం సుబేదారిలోని రోహిణి హాస్పిటల్లో చేర్పించిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం రాత్రి చనిపోయింది. మృతదేహాన్ని పోస్ట్టుమార్టం నిమిత్తం ఎంజీఎం దవాఖాన మార్చురీకి తరలించడంపై హాస్పిటల్ యాజమాన్యం అమానుషంగా వ్యవహరించిందని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. రోహిణి హాస్పిటల్ నర్సింగ్ హాస్టల్ ఇన్చార్జి రాంరెడ్డి, ప్రిన్సిపాల్ చైతన్య కారకులని, వారి వేధింపుల వల్లే తమ కూతురు ఉరేసుకుందని మృతురాలు తండ్రి తిరుపతి సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అర్ధరాత్రి మృతదేహం తరలింపు
రోహిణి హాస్పిటల్ యాజమాన్యం రవళి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అర్ధరాత్రి ఎంజీఎం మార్చురీకి తరలించడంపై విమర్శలు వస్తున్నాయి. పోలీసులను రప్పించి, తమను బయటకు పంపి, పక్కా ప్లాన్‌తో అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటిలేటర్‌పై ఉన్న రవళి చనిపోయిందని రాత్రి 11 గంటలకు తల్లికి మాత్రమే చెప్పారని, ఆ తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు గొడవ చేస్తారని పోలీసులను రప్పించి, అర్ధరాత్రి అనాథ శవంలా తీసుకెళ్లారని మండిపడ్డారు. ‘డ్యూటీ డాక్టర్లను అడిగితే నాతోపాటు బంధువులను పోలీసులతో బెదిరించిన్రు. లోపలికి వెళ్లకుండా బయటకు నెట్టేసి, నా భార్య బట్టల సంచిని బయటపడేసిన్రు. అంబులెన్స్‌లో నా బిడ్డ శవాన్ని అనాథలా ఎంజీఎంకు అర్ధరాత్రి తరలించిన్రు’ అంటూ తండ్రి తిరుపతి రోదించాడు. చనిపోయిన మా బిడ్డపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కుటుంబ గొడవల కారణంగా చనిపోయిందని యాజమాన్యం ప్రచారం చేస్తున్నదని, నా బిడ్డను పొట్టన పెట్టుకున్న యాజమాన్యానికి ఉసురు తాకుతుందని తల్లిదండ్రులు శాపనార్థాలు పెట్టారు. కాగా, రవళి చనిపోయిందన్న సమాచారంతో సోమవారం ఉదయం బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు హాస్పిటల్‌కు తరలివచ్చి కొద్దిసేపు ఆందోళన చేశారు. దీంతో సుబేదారి సీఐ రాఘవేందర్ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులను బయటకు పంపించారు.