ఉమ్మడి జిల్లాలో రూ.5,849 కోట్ల ‘రైతుబంధు’ నగదు జమ
పెట్టుబడి సాయం అందజేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే
రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకుంటున్న రైతులు
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
వరంగల్, జనవరి 10 : రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయంతో రైతును రాజు చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు నేటితో రూ.50వేల కోట్ల పెట్టుబడిసాయం అందించిన సందర్భంగా సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలోని 64 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నగదు జమచేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారని తెలిపారు. నవతరం వ్యవసాయం వైపు మళ్లేందుకు సీఎం కేసీఆర్ స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఎవ్వరూ ఆలోచించని విధంగా రైతుల గురించి ఆలోచన చేసి రైతు బంధు పథకాన్ని తీసుకవచ్చారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబురాలు చేసుకుంటున్నారని, ఇంటింటా రైతు బంధు ముగ్గులతో సీఎం కేసీఆర్కు ఆశీర్వాదాలు ఇస్తున్నారని తెలిపారు. ఊరూరా ఎడ్లబండ్ల ర్యాలీలు తీస్తున్నారని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో రూ.5,849కోట్లు
రైతుబంధు పథకం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.5,849కోట్లు జమ అయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. జనగామ జిల్లాలో రూ.1,481కోట్ల 78 లక్షలు, వరంగల్ జిల్లాలో రూ.940 కోట్ల 51 లక్షలు, హనుమకొండ జిల్లాలో రూ.916 కోట్ల 79 లక్షలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.756 కోట్లు, మహబూబాబాద్ జిల్లాలో 1273 కోట్లు, ములుగు జిల్లాలో రూ.481 కోట్ల 96 లక్షలు రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు.