ఉదయం 7 గంటల రిజర్వేషన్
30 మంది ఉంటే కాలనీకే బస్సు : ఆర్టీసీ ఆర్ఎం
తాడ్వాయి, జనవరి 10 : మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ర్టాల్లోని భక్తులు దర్శనానికి వచ్చారు. మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తల్లుల గద్దెల వద్దకు చేరుకుని బంగారం, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించారు.
ముందస్తు భక్తులకు క్యూలైన్ల ఏర్పాటు
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తాత్కాలిక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. గత ఆదివారం సుమారు లక్షమంది భక్తులు నేరుగా అమ్మవార్ల ప్రధాన ద్వారం వద్ద ఉన్న క్యూలైన్ల ద్వారా రావడంతో గద్దెల వద్ద రద్దీ ఏర్పడి ఇబ్బందులు కలిగాయి. వచ్చే బుధవారం కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్రావు సోమవారం పక్కనే ఉన్న క్యూలైన్లను పరిశీలించారు. భక్తులు ఒక్కసారిగా గద్దెల వద్దకు రాకుండా మూడు క్యూలైన్లను సిద్ధం చేస్తున్నారు.
హనుమకొండ బస్టాండ్, కాజీ పేట నుంచి మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ డి.విజయ్‌భాస్కర్ తెలిపారు. ఉదయం 7గంటలకు హనుమకొం డ నుంచి మేడారానికి బయల్దేరే ఎక్స్‌ప్రెస్ బస్సుకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించామని పేర్కొన్నారు. ఈ బస్సు తిరిగి సాయంత్రం 4 గంటలకు మేడారం నుంచి బయల్దేరుతుందని తెలిపారు. ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని, రద్దీ ఉంటే హనుమకొండ బస్టాండ్ నుంచి బస్సులు నడపనున్నట్లు, కాలనీలో బ్యాచ్‌గా 30 మంది ఉంటే అక్కడికే ప్రత్యేక బస్సు పంపుతామని పేర్కొన్నారు. అదేవిధంగా కాజీపేట నుంచి ఉదయం 7.15 గంటలకు, 8.15 గంటలకు, హసన్‌పర్తి నుంచి 8.30 గంటలకు, వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 5.30, మధ్యా హ్నం 3.30 గంటలకు మేడారానికి బస్సు సౌకర్యం కల్పించినట్లు, హను మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి పెద్దలకు చార్జి రూ.125, పిల్లలకు రూ.65, ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా బస్సులను నడుపుతున్నట్లు ఆర్ఎం తెలిపారు. వివరాలకు వరంగల్-2 డిపో మేనేజర్ 99592 26048, హనుమకొండ డిపో మేనేజర్ 99592 26049, వరంగల్-1 డిపో మేనేజర్ 99592 26047 నంబర్లలో సంప్రదించాలని కోరారు.