12 పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్
ఇప్పటికే 2829 మంది టీనేజర్లుకు టీకా
ఇందులో మొదటి డోస్ 261, రెండో డోస్ 2568
భూపాలపల్లి టౌన్, జనవరి 10: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బూస్టర్ డోస్ (మూడో డోస్ వ్యాక్సిన్) ప్రారంభమైంది. 60 ఏండ్లు పైబడిన వృద్ధులతో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు మూడో డోస్ అందించే ప్రక్రియను వైద్యశాఖ అధికారులు ప్రారంభించారు. జిల్లాలోని 12 పీహెచ్‌ల్లో, భూపాలపల్లిలోని సింగరేణి ఏరియా వైద్యశాలలో బూస్టర్ డోస్ అందిస్తున్నారు. 12 పీహెచ్‌సీల పరిధిలో మున్సిపల్ 122, రెవెన్యూ 619, వైద్య ఆరోగ్య సిబ్బంది 1,888, పోలీసు 852, పంచాయతీ రాజ్ సిబ్బంది 1,227, 60 ఏళ్లు పైబడిన వారు 10,599 మంది ఉన్నట్లు అధి కారులు గుర్తించారు.
18 ఏళ్లలోపు 2829 మందికి
ఒకవైపు బూస్టర్ డోసు సోమవారం ప్రారంభం కాగా ఇప్పటికే జిల్లాలో 2829 మంది టీనేజర్లకు వాక్సిన్ అందించారు. ఇందులో మొదటి డోస్ 261, రెండో డోస్ 2568 మందికి ఇచ్చారు. పీహెచ్‌సీల వారీగా అంబట్ పల్లిలో 246, ఆజంనగర్ 30, భూపాలపల్లి 83, చెల్పూర్ 71, గణపురంలో 366, కాటారం 30, మహాముత్తారం 263, మొగుళ్లపల్లి 20, రేగొండ 592, తాడిచెర్ల 900, వెలిశాల 23, ఒడితెల 190, భూపాలపల్లి సింగరేణి హాస్పిటల్లో 15 మందికి వ్యాక్సిన్ అందించారు.
బూస్టర్‌డోస్ తీసుకోవాలి : డీఎంహెచ్‌వో అప్పయ్య
ములుగురూరల్, జనవరి10 : కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు రెండేళ్లుగా తీవ్రంగా కృషి చేస్తున్న వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్ బూస్టర్ డోస్ టీకాలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో అప్పయ్య అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ దవాఖానలో ఆయన సోమవారం ప్రారంభించారు. జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ పోరిక రవీందర్‌నాయక్‌కు బూస్టర్ డోస్ టీకాను వేశారు. తొలిరోజు ఆన్లైన్లో నమోదు చేసుకున్న 500 మంది ఫ్రంట్‌లైన్ వారియర్లకు టీకాలను అందించినట్లు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్యాంసుందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయినిగూడెం వైద్యాధికారిణి పోరిక జోత్స్నాదేవి, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.