రూ. 50 వేల కోట్ల రైతుబంధు సాయం
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
ప్రజా నాయకుడు ఎమ్మెల్యే గండ్ర : వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్
ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి : జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి
కృష్ణకాలనీ, జనవరి 9 : తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ముత్యాల ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయంగా 70 వేల మంది రైతుల ఖాతాల్లో రూ. 50వేల కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో జనగామ జిల్లా బచ్చన్నపేటకు సీఎం కేసీఆర్ వెళ్లినప్పుడు వృద్ధులు కనిపించారు. యువత ఎక్కడ అని అడుగగా పంటలు పండకపోవడంతో వలస పోయారని చెప్పడంతో కేసీఆర్ చలించిపోయారని గుర్తు చేశారు. నాటి ఆయన ఆలోచనకు ప్రతిరూపమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తెలిపారు. దీంతో ప్రస్తుతం బచ్చన్నపేటలో వలసలు లేవని, సంబురంగా సాగు చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటిమయమవుతుందన్న నాటి పాలకులు నేటి అభివృద్ధినికి చూసి తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. బోర్లు, బావుల మోటర్ల కరెంట్‌కు ప్రతి నెలా రూ.10 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు చెప్పారు. రైతుబంధుతో పెట్టుబడి సాయం, రైతుబీమాతో మృతుడి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కానీ, ఇవన్నీ బీజేపీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. స్థాయి మరిచి మాట్లాడుతున్న బండి సంజయ్‌కి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. చేతనైతే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి పథకాలు అమలు చేయాలని సవాల్ విసిరారు. హుజూరాబాద్ గెలుపును బలుపు అనుకుంటున్న కేంద్రానికి రైతుల గోస తగులుతదని, ప్రధానికి పట్టిన గతే రాష్ట్ర బీజేపీ నాయకులకు పడుతుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరిక మేరకు త్వరలో జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ మంజూరు కానున్నట్లు ఆమె తెలిపారు.
వెయ్యి మందికి అన్నదానం
రైతుబంధు సంబురాల్లో భాగంగా అంబేద్కర్ క్రీడామైదానంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముత్యాల ముగ్గుల పోటీలకు వచ్చిన మహిళలు, ప్రజా ప్రతినిధులు కళకారులతో పాటు సుమారు వెయ్యి మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ కళ్లెపు శోభారఘుపతిరావు, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, రైతుబందు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఎంపీపీ మందల లావణ్య విద్యాసాగర్‌రెడ్డి, జంగేడు, కాటారం, గణపురం పీఏసీఎస్ చైర్మన్లు మేకల సంపత్ కుమార్, చల్లా ధర్మా రెడ్డి, పూర్ణ చంద్రారెడ్డి, టీఆర్ఎస్ అర్భన్ అధ్యక్ష, కార్యదర్శులు కటకం జనార్దన్పటేల్, బీబీచారి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కౌన్సిలర్లు, మాజీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నాయ కులు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బుర్ర సునీత, సీడీపీవో అవంతి, మున్సి పాలిటీ వార్డుల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు, యూత్ నాయకులు, కో ఆప్షన్ సభ్యు లు, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సీఎం కేసీఆర్ ముఖచిత్రం
అంబేద్కర్ క్రీడా మైదానంలో జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ సుమారు 240 గజాల స్థలంలో వేసి సీఎం కేసీఆర్ చిత్రం పలువురిని ఆకట్టుకున్నది. మిమిక్రి ఆర్టిస్ట్‌లు, చిందు కళాకారులు యక్షగానం, గంగిరెద్దుల విన్యాసాలు అలరించాయి. వరంగల్‌కు చెందిన వడ్లకొండ అనిల్ బృం దం పాడిన తెలంగాణ ధూందాం, బతుకమ్మ పాటలు, రైతుబంధు పాటలు స్థానికులను ఉర్రూతలూగించాయి. మిమి క్రి కళాకారుడు సురేశ్ ప్రదర్శనతో ఆహూతులు ఆనందంలో మునిగిపోయారు.
వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్ : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రైతుబంధు, రైతు బీమా పథకాలతో వ్యవసాయాన్ని పండగలా చేసిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలతో పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్లు చేశారని గుర్తు చేశారు. 12 వేలకు పైగా కుటుంబాల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి సింగరేణి కుటుంబాలను ఆదుకున్నాడన్నారు. బస్తీ, పల్లె దవాఖానలతో ప్రతి పేదవాడికీ వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.శివరాజ్ చౌహాన్‌ది రైతులను కాల్చి చంపిన చరిత్ర అని చెప్పారు