మణుగూరు రూరల్, నవంబర్ 8 : సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు సిద్ధమేనని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు స్పష్టం చేశారు. కేసీహెచ్‌పీలో సోమవారం జరిగిన గేట్ మీటింగ్‌కు ఆయన హాజరై, కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణిలోని నాలుగు మైన్ల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తే అలాంటి బ్లాకులను కేంద్రం ఓపెన్ టెండర్ ద్వారా ప్రైవేట్‌కు కేటాయించాలనుకోవడాన్ని సహించేది లేదన్నారు. కేంద్రం తీరు మార్చుకోకపోతే టీబీజీకేఎస్ నేతృత్వంలో సమ్మె చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. టీబీజీకేఎస్ ఎలాంటి పిలుపు ఇచ్చినా కార్మికవర్గం సిద్ధంగా ఉండాలన్నారు. టీబీజీకేఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని జాతీయ సంఘాలు.. గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే గుర్తింపు సంఘంతో పాటు అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆర్ఎల్సీకి వినతిపత్రాన్ని అందించాయని విమర్శించారు. టీబీజీకేఎస్‌కు గడువు కాలం ఉన్నప్పటికీ మతిభ్రమించి హడావుడి చేస్తున్నాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంలో సాధించిన సంక్షేమ పథకాలే టీబీజీకేఎస్‌కు శ్రీరామ రక్షగా నిలిచి 11 ఏరియాల్లో విజయకేతనం ఎగరవేయడం ఖాయమన్నారు. సింగరేణి కార్మికులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా ప్రమాదబీమాలో భాగంగా కార్మికుడు మృత్యువాత పడితే రూ.40 లక్షల నుంచి రూ.50లక్షలు, కాంట్రాక్ట్ కార్మికుడికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఇచ్చేలా అంగీకారం తెలిపిందన్నారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వీ ప్రభాకర్‌రావు, లెవన్మన్ కమిటీ మెంబర్ సామా శ్రీనివాసరెడ్డి, కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రవూఫ్, బ్రాంచ్ నాయకులు వీరభద్రయ్య, కోట శ్రీనివాసరావు, కాపా శివాజీ, వర్మ, వెంకటేశ్వరరెడ్డి, బానోత్ కృష్ణ, పిట్ సెక్రటరీలు రామారావు, అశోక్, బుద్ధ వెంకటేశ్వర్లు, మైపాషా, నాగెల్లి నాయకులు వెంకటేశ్వర్లు, ముత్యం, వెంకట్రావు, ఆదిశంకర్, బాలాజీ తదితరులు ఉన్నారు.
బాధితురాలి వినతి..
ఓసీ-2లో డంపర్ బొలేరో ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికుడు వేల్పుల చిన వెంకన్న మృతిచెందగా, భార్య సుజాత తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వెంకట్రావుకు వినతిపత్రం అందజేసింది. తన భర్త చనిపోయి మూడు నెలలైనా యాజమాన్యం నుంచి పరిహారం అందలేదని, వర్క్‌మన్ కాంపన్సేషన్, ఎక్స్‌గ్రేషియా, ధ్వంసమైన బొలెరోకి నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయండి..
సింగరేణి ఉత్పాదకతల్లో బొగ్గు రవాణాలో సింగరేణి సంస్థకు విశిష్టసేవలందిస్తూ పర్మినెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని, ప్రతి నెలా 10వ తేదీలోగా వేతనాలు చెల్లించేలా చూడాలని కాంట్రాక్ట్ కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్ట్యూ నాయకులు సంజీవ్, సూపర్వైజర్లు వీరభద్రం, లక్ష్మీనారాయణ, కాంట్రాక్ట్ కార్మికులు పిచ్చయ్య, జానయ్య, నాగరాజు, టిక్యా, లింగయ్య, రామారావు, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, చలపతి, లక్ష్మయ్య ఉన్నారు.
వేలాన్ని రద్దు చేయాలి..
గోదావరిఖని, నవంబర్ 8: బొగ్గు గనుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.కృష్ణ కోరారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కారు చౌకగా పెట్టుబడి దారులు, బడా పారిశ్రామిక వేత్తలకు బొగ్గు బ్లాకులను విక్రయించే కుట్ర సరికాదన్నారు. దేశంలోని 86 బొగ్గు బ్లాకులు, అందులో సింగరేణికి చెందిన నాలుగు బ్లాకులను వేలం వేయాలని చూస్తుందని తెలిపారు. ఈ గనులు ప్రైవేట్ పరమైతే భవిష్యత్‌లో సింగరేణి సంస్థను కూడా పూర్తిగా విక్రయిస్తుందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఎం.కొంరయ్య, ఇ.నరేశ్, దుర్గయ్య, బాబు, ప్రసాద్, మొండ న్న, చంద్రయ్య, సాంబయ్య, మల్లేశం, మహేందర్ ఉన్నారు.