జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : పోడు భూముల సమస్య పరిష్కారం కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇందుకోసం గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటుచేసి శిక్షణ కూడా ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 13 డిసెంబర్ 2005కు ముందునుంచి పోడు చేసుకుంటున్న రైతుల కోసం నేటి నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పర్యవేక్షించేందుకు కలెక్టర్ భవేశ్‌మిశ్రా మండలానికో జిల్లాస్థాయి అధికారిని స్పెషలాఫీసర్‌గా నియమించగా, ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణపై గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయి కమిటీలకు పలు సూచనలు చేశారు. ప్రతి దరఖాస్తును రిజిస్టర్లో నమోదు చేయనుండగా, స్థానిక ప్రజాప్రతినిధులను సైతం ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు.
జయశంకర్ జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లోని అధికారులు, ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయిలో అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు పోడుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సకల సన్నాహాలు చేస్తున్నారు. పర్యవేక్షణకు కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రత్యేక అధికారులను సైతం నియమించారు. ఈ కార్యక్రమం నిర్వహణపై ఆయన గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలకు పలు సూచనలు చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం నవంబర్ 8 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కొద్ది రోజుల క్రితం అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు పోడు భూముల వివరాలను సేకరించారు. జిల్లాలోని ఆరు మండలాల్లో అటవీ భూములను నమ్ముకొని గిరిజనులు, గిరిజనేతరులు తరతరాలుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం నిబంధనలకు లోబడి హక్కు పత్రాలు అందించనున్నారు.
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం జిల్లాలో ఆర్ఓఎఫ్ఆర్చట్టం ప్రకారం 13 డిసెంబర్ 2005కు ముందు నుంచి పోడు చేసుకుంటున్న రైతులకు నేటి నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. రైతులు పోడు భూములకు సంబంధించిన ఆధారాలతో కూడిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రామ సభల ద్వారా అవగాహనలు
జిల్లాలో 91 గ్రామపంచాయతీల్లో 150కి పైగా ఆవాసాల్లో గ్రామ సభలు నిర్వహించిన అధికారులు పోడు రైతులకు అవగాహన కల్పించారు. అలాగే గ్రామ స్థాయిలో అటవీహక్కుల కమిటీలను ఏర్పాటు చేశారు. దరఖాస్తుల స్వీకరణ కోసం జిల్లా, మండల స్థాయి అధికారులకు ప్రభుత్వం శిక్షణ నిర్వహించింది.
అధికారుల పర్యవేక్షణ
పోడు భూములకు హక్కుల పత్రాలు అందించే కార్యక్రమానికి క్షేత్ర స్థాయిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టంగా నిర్వహించేందుకు అధికారులు పర్యవేక్షించనున్నారు. దరఖాస్తుల స్వీకరణపై శిక్షణ పొందిన జిల్లా, మండల స్థాయి అధికారులు అటవీహక్కుల కమిటీలతో కలిసి సమన్వయం చేయనున్నారు. అర్హలైన వారు దరఖాస్తులు చేస్తున్నారా లేదా నిబంధనలకు లోబడి దరఖాస్తులు చేసే విధానాన్ని అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించనున్నారు. ఇందుకు కలెక్టర్ సైతం ఆదేశాలు జారీ చేశారు.