గర్భిణుల ఆరోగ్యంపై స్పెషల్ డ్రైవ్
ఇంటి వద్దే రక్త పరీక్షలు, అక్కడే రిపోర్టు
సెల్ కౌంటర్ యంత్రాలతో గ్రామాలకు తరలిన ల్యాబ్ టెక్నీషియన్లు
ప్రారంభమైన రక్త నమూనాల సేకరణ
జయశంకర్ జిల్లాలో 2995 మంది గర్భిణులు
మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యం
కలెక్టర్ ప్రత్యేక ఫోకస్.. డీఎంహెచ్‌వో పర్యవేక్షణ
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 7 : గర్భిణుల ఆరోగ్యమే లక్ష్యంగా జయశంకర్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం రూపుదిద్దుకుంది. వారి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని సుఖ ప్రసవం జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలోని అన్ని దవాఖానల ల్యాబ్ టెక్నీషియన్లు సెల్ కౌంటర్ యంత్రాలతో సబ్ సెంటర్లు, గ్రామ పంచాయతీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అక్కడే రిపోర్టులు సైతం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం పది రోజుల పాటు నిర్వహించనుండగా, గురువారం ప్రారంభించారు. 2,995 మంది గర్భిణులకు పరీక్షలు చేయనున్నారు. దీనిపై కలెక్టర్ కృష్ణ ఆదిత్య స్పెషల్ ఫోకస్ పెట్టగా, డీఎంహెచ్‌వో శ్రీరామ్ పర్యవేక్షించనున్నారు.
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల సబ్‌సెంటర్ల పరిధి గ్రామాల్లో గర్భిణులకు రక్త పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని సుఖ ప్రసవం జరిగేలా చూడడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందుకు జిల్లాలోని అన్ని దవాఖానల్లో పని చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు సెల్ కౌంటర్ యంత్రాలతో గ్రామాలకు వెళ్లి సబ్‌సెంటర్లు లేదా గ్రామ పంచాయతీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. గర్భిణుల ఇండ్ల వద్దకు వెళ్లి రక్త నమూనాను సేకరించి అక్కడే పరీక్షలు చేసి రిపోర్టులు ఇస్తారు. ఈ ప్రక్రియ జిల్లావ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ పర్యవేక్షిస్తున్నారు.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి
గర్భిణుల ఆరోగ్యంపై కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రత్యేక దృష్టి సారించారు. సుఖ ప్రసవం, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు గ్రామాల్లోనే రక్త నమూనాలను సేకరించి అక్కడే రిపోర్టులు ఇవ్వాలని, ఈ కార్యక్రమం జిల్లాలో 10 రోజులపాటు కొనసాగాలని ఆదేశించారు. జిల్లాలోని 2,995 మంది గర్భిణులకు పరీక్షలు చేయాలని, వారి ఆరోగ్యంపై నెలవారీ రిపోర్టుల్లో పురోగతి కనిపించాలని సూచించారు. జిల్లాలో 13 పీహెచ్‌సీలు, 90 సబ్‌సెంటర్లు ఉన్నాయి. అయితే పీహెచ్‌సీలకు సెల్ కౌంటర్ యంత్రాలు లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఒక్కొక్క సెల్ కౌంటర్ యంత్రానికి రూ.3.30 లక్షలు వెచ్చించి అన్ని పీహెచ్‌సీలకు అందించారు. ప్రతి ల్యాబ్ టెక్నీషియన్ మూడు నెలల పాటు పరీక్షలకు అవసరమయ్యే సామగ్రి, రసాయనాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
ప్రారంభమైన స్పెషల్ డ్రైవ్
జిల్లాలో గురువారం స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. 17 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉండగా వారంతా సబ్ సెంటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లోకి వెళ్లి గర్భిణులకు పరీక్షలు చేస్తున్నారు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సీబీపీ), హిమోగ్లోబిన్, బ్లడ్ గ్రూపింగ్ (ఆర్‌హెచ్ టైపింగ్), మలేరియా, డెంగీ, బ్లడ్ క్లాటింగ్ టైం పరీక్షలు నిర్వహించి అక్కడే రిపోర్టు ఇస్తారు. ఆ రిపోర్టును గర్భిణులు నెలవారీ పరీక్షలకు దవాఖానకు వెళ్లే సమయంలో తీసుకెళ్లి డాక్టర్‌కు చూపించుకుని చికిత్స పొందాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ ప్రతి రెండు నెలలకు ఒకసారి కొనసాగుతూనే ఉంటుంది. గర్భిణుల ఆరోగ్య స్థితిగతులు పూర్తిగా తెలుసుకుంటూ చికిత్సలు అందించడం సులభతరమవుతుంది. తద్వారా సుఖ ప్రసవం సాధ్యమవుతుందని వైద్యులు తెలుపుతున్నారు.
స్పెషల్ ఫోకస్ పెట్టాం..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ఉన్న 2,995 మందికి ప్రత్యేకంగా సెల్ కౌంటర్లతో వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించి అక్కడే రిపోర్టు ఇచ్చి రావాలనేది కలెక్టర్ కాన్సెప్ట్. ఈ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తద్వారా సర్కారీ వైద్యంపై సామాన్య ప్రజలకు భరోసా కలుగుతుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.