నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్7: ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం దేవస్థానంలో పార్వతీ దేవి, సరస్వతీ అమ్మవారి ఆలయంలో అర్చకులు దుర్గా మాతను ప్రతిష్ఠించారు. మొదటి రోజు దుర్గాదేవి శైలపుత్రిగా దర్శనమిచ్చారు. రెండో రోజు దుర్గాదేవి బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీ, కృష్ణకాలనీ, శాంతినగర్, యాదవ కాలనీ, సుభాష్ కాలనీ, జవహర్‌నగర్ కాలనీ, ఫైలెట్ కాలనీ, లక్ష్మీనగర్, హనుమాన్ నగర్ కాలనీల్లో ఆయా వార్డులు కౌన్సిలర్లు దుర్గాదేవికి మండపాలను ఏర్పాటు చేసి ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కారల్ మార్క్స్ కాలనీలో దుర్గాదేవిని ప్రతిష్ఠించారు. 6వ వార్డు కౌన్సిలర్ ఎడ్ల మౌనిక శ్రీనివాస్, 30వ వార్డు కౌన్సిలర్ మాడ కమల హాజరయ్యారు. మల్హర్ మండలం తాడిచెర్లలో భవాని యువసేన ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వల్లెంకుంటలోని శక్తి పీఠపాలిత త్రిశక్తి పీఠ దేవస్థానంలో ఉత్సవాలను ప్రారంభించారు. కాటారంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బీరెళ్లి అంజయ్య గృహం వద్ద, అయ్యప్పస్వామి ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏటూరునాగారంలో శివాలయం, సాయిబాబా ఆలయం, క్రాస్‌రోడ్డు, రామాలయంతోపాటు వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయ నిర్మాణ స్థలంలో స్టార్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాను ప్రతిష్ఠించారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. పస్రా, గోవిందరావుపేట తదితర గ్రామాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించారు. మంగపేట మండలంలోని కమలాపురం రామాలయం, మంగపేటలోని ఉమాచంద్రశేఖరస్వామి ఆలయ ప్రాంగాణాల్లో అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించారు. వెంకటాపురం(నూగూరు) మండలం దుర్గమ్మగుడి సెంటర్, బ్యాంక్ సమీపంలోని సెంటర్లలో దుర్గా పూజలు నిర్వహించారు.