ఉన్నత శ్రేణి మున్సిపాలిటీవైపు అడుగులు
ప్రజలకు మెరుగైన వసతులు
కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్న రాష్ట్ర సర్కారు
నాలుగు లైన్ల రోడ్లు,సెంట్రల్ లైటింగ్ సిస్టం
ఇంటిగ్రేటెడ్, మోడల్ మార్కెట్లు, ఇండోర్ స్టేడియం, ఓపెన్‌జిమ్‌లు
రూ.కోటితో అత్యాధునిక వైకుంఠధామం నిర్మాణం
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ);బెస్ట్ మున్సిపాలిటీ దిశగా భూపాలపల్లి దూసుకుపోతున్నది. ఇటు ప్రజలకు మౌలిక సదుపాయాలతో పాటు జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరుచేస్తున్నది. ఇందులో భాగంగా ఓ వైపు అద్దంలా మెరిసే నాలుగు లైన్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్‌తో కోల్‌బెల్ట్ ఏరియా వెలిగిపోతున్నది. ఇటీవల ఇంటిగ్రేటెడ్, మోడల్ మార్కెట్లు, ఇండోర్ స్టేడియం, ఓపెన్‌జిమ్, వైకుంఠధామం కోసం టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, అతి త్వరలో ఉన్నత శ్రేణి పట్టణంగా రూపుదిద్దుకోనుంది.
భూపాలపల్లి మున్సిపాలిటీ ఉన్నత శ్రేణి పట్ట ణంగా రూపుదిద్దుకుంటోంది. అభివృద్ధి చెందు తున్న పట్టణాలకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తోంది. ఈక్రమంలో జనాభాకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో విశేష కృషిస్తున్నా రు. ఇందులో భాగంగా జిల్లాకేంద్రంలోని కూరగా యల మార్కెట్ సమీపంలో రూ.కోటి వ్యయంతో సమీకృత మార్కెట్ నిర్మించనున్నారు. పట్టణ వాసులకు కూరగాయలతో పాటు మాంసం ఒకేచోట దొరికేలా సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తీర్చిదిద్దనున్నారు. దీని వల్ల చిరువ్యాపారులకూ ఎంతో ప్రయోజనం చేకూర నుంది. అలాగే యైటింక్లయిన్ థౌజెండ్ క్వార్టర్స్ నర్సరీ సమీపంలో ఒక ఎకరంలో రూ. 5.5 కోట్ల వ్యయంతో మోడల్ మార్కెట్‌ను అత్యాధునికంగా నిర్మించనున్నారు
ఇండోర్ స్టేడియం, ఓపెన్ జిమ్‌లు
జిల్లాకేంద్రంలో ఉన్న సింగరేణికి చెందిన అంబేద్కర్ స్టేడియం, ఆచార్య జయశంకర్ స్మారక పార్కు, ఎకో పార్కులతో పాటు రూ.4.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మించనున్నారు. వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. అలాగే ఎనిమిది ఓపెన్ జిమ్ సెంటర్లను ఏర్పాటుచేయనుండగా, ఇప్పటికే మున్సిపాలిటీ ఆమోదం తెలిపింది.
సెంట్రల్ లైటింగ్ వెలుగులు..
రాత్రివేళ భూపాలపల్లి పట్టణం మిరుమిట్లు గొలిపే కాంతులతో వెలిగిపోనున్నది. ఇందుకోసం జిల్లాకేంద్రం నుంచి చెల్పూర్ వరకు రూ.50 కోట్లతో నాలుగు లైన్ల రహదారితో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకానున్నది. అలాగే గణేశ్‌చౌక్ రాజీవ్ విగ్రహం నుంచి సెగ్గంపల్లి వరకు రూ.10 కోట్లతో డబుల్ రోడ్డు, జీఎం కార్యాలయం నుంచి ఓసీపీ-2 వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టం అందుబాటులోకి రానున్నది. వీటితో పాటు రూ.కోటి వ్యయంతో అత్యాధునిక వసతులతో వైకుంఠధామం నిర్మించనున్నారు. కొవిడ్ మృతదేహాలను దహనం చేసేందుకు ప్రత్యేకంగా ప్లాట్ఫారం నిర్మిస్తారు.
వీధి వ్యాపారులకు ప్రత్యేక షెడ్లు..
జిల్లాకేంద్రంలోని వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక షెడ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రూ.15 లక్షలు ఖర్చు చేయనుండగా గత నెల 26న రాష్ట్ర బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు శరవేగంగా ముందుకుసాగుతున్నాయి.