జోరుగా టీఆర్ఎస్ వార్డు, గ్రామ కమిటీ ఎన్నికలు
మండలాలవారీగా ఎమ్మెల్యే గండ్ర సమావేశాలు
పార్టీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ పాటిస్తున్న గులాబీ శ్రేణులు
పదవులకు కోసం పోటీపడుతున్న ఆశావహులు
50కి పైగా గ్రామ కమిటీలకు ఎన్నికలు పూర్తి
ఈ నెల 12వరకుపూర్తికానున్న కమిటీలు
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తేతెలంగాణ);పార్టీని బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ ‘సంస్థాగత’ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తున్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకుసాగుతున్నది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా ఊరూరా గ్రామ, వార్డు, మండల, పట్టణ కమిటీల నియామక ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండలాలవారీగా సమావేశాలు నిర్వహించి కష్టపడి పని చేసే వారికి పదవులు ఇస్తూ సమన్యాయం చేస్తున్నారు. అలాగే మంథని నియోజకవర్గ పరిధిలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆదేశాలతో గ్రామాల్లో ఎన్నికలను సజావుగా పూర్తి చేస్తున్నారు. ఇలా రెండు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే 50కి పైగా గ్రామ కమిటీలకు ఎన్నికలు పూర్తి కాగా.. కమిటీలో చోటుకోసం ఆశావహులు, క్రియాశీలక సభ్యులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలతో సందడిగా మారింది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో సమష్టిగా గ్రామ, వార్డు కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలను నియమిస్తున్నారు. పార్టీ పదవుల కోసం ఆశావహుల సంఖ్య గణనీయంగా ఉండటంతో ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్లు, అడహక్ కమిటీ, పరిశీలకులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావులేకుండా పూర్తి చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాలు రెండు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో భూపాలపల్లి, గణపురం, రేగొండ, టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి, శాయంపేట మండలాలు ఉండగా మంథని నియోజకవర్గ పరిధిలో కాటారం, మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్రావు ఉన్నాయి. భూపాలపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటనలు చేస్తూ పార్టీ మండల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంస్థాగత ఎన్నికలు చాలా ముఖ్యమని, మంచి నాయకులకు అవకాశం కల్పించడం ద్వారా పార్టీని బలోపేతం చేయవచ్చన్నారు. మంథని నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆదేశాల మేరకు ఐదు మండలాల్లో అడహక్ కమిటీలను నియమించి కమిటీల ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తి చేస్తున్నారు. ఈ నెల 12 వరకు గ్రామ, వార్డు కమిటీలను పూర్తి చేసి, తరువాత అన్ని మండల కమిటీల ఎంపికను పూర్తి చేయనున్నారు.
మండల, పట్టణ సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గండ్ర
నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంస్థాగత ఎన్నికలకు జారీ చేసిన పార్టీ నియమ, నిబంధలు వారికి తెలియజేస్తున్నారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ, పార్టీ ఉన్నతికి పాటుపడే వారికి పదవులు దక్కుతాయని తెలియజేస్తున్నారు.
50కి పైగా గ్రామ కమిటీల నియామకం
జిల్లాలోని రెండు నియోజక వర్గాల పరిధిలో సుమారు 50పైగా గ్రామ కమిటీలకు కన్వీనర్లు, ఇన్చార్జిలుగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేస్తున్నారు. అలాగే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు సైతం టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీసిద్ధు ప్రాతినిధ్యంవహిస్తున్న ఒకటో వార్డులో వార్డు కమిటీ ఎన్నికలను పండుగ వాతావరణంలో సోమవారం నిర్వహించారు.