కలెక్టర్ భవేశ్ మిశ్రా
భూపాలపల్లి రూరల్, జనవరి 4: ప్రభుత్వ, రెవెన్యూ విధానంతోపాటు తనపై 99టీవీ రిపోర్టర్ చేసిన అనుచిత ఆరోపణలను ఖండిస్తున్నానని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాటారం మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన పస్తాం భూ లక్ష్మికి కంబల్పాడు శివారులో సర్వే నంబర్ 38/Aలో 4.20 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఆ భూమిని తాను 2009లో కొనుగోలు చేశానని తనకు రిజిస్ట్రేషన్ చేసి పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని కాటారానికి చెందిన జంగ సమ్మయ్య రిజిస్ట్రేషన్ పేపర్లతో రెండు నెలల నుంచి తనవద్దకు వస్తున్నాడని అన్నారు. మద్దులపల్లికి చెందిన పస్తాం భూ లక్ష్మిని పిలిపించుకొని అడుగగా తాను అతనికి భూమి అమ్మలేదని ఇప్పటికీ ఆ భూమి తన పేరునే ఉందని ఆమె తెలిపారు. భూ లక్ష్మీకి సంబంధించిన 4.20 ఎకరాల భూమిని ఇటీవల కొనుగోలు చేశానని, తనపేరున పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలంటూ 99టీవీ రిపోర్టర్ దూలం రాజమొగిలి రెండు నెలల నుంచి అడుగుతున్నాడని అన్నారు. మంగళవారం 99 టీవీ రిపోర్టర్ రాజమొగిలి తన వద్దకు వచ్చి ఆభూమికి పట్టా పాస్‌పుస్తకం ఇవ్వాలని అడిగాడని అన్నారు. పట్టాదారు రాలైన భూలక్ష్మి అంగీకారం మేరకే పట్టాచేయడానికి వీలుకలుగుతుందని చెప్పగా కలెక్టర్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి 99 టీవీ రిపోర్టర్ ప్రభుత్వం, రెవెన్యూ విధానం, తనపైనా అనుచిత ఆరోపణలు చేశాడని అన్నారు. మీడియలో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడుతూ, ఇతరుల భూములను కబ్జచేస్తూ అడిగితే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం నమోదు చేసుకునేలా చూడాలి
జిల్లాలోని ఎస్సీ విద్యార్థులందరూ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్ నమోదు చేసుకునేలా చూడాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 1460 మంది విద్యార్థులు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని, ఇంకా జిల్లాలో 739 మంది విద్యార్థులు నమోదు చేసుకోలేదని తెలిపారు. వారు త్వరగా నమోదు చేసుకునేలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్పేర్ ఆపీసర్లు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి
భూపాలపల్లి టౌన్, జనవరి 4: పల్లె ప్రగతి పనులు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం భూపాలపల్లి పట్టణంలోని ప్రగతి భవన్లో ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీరాజ్ శాఖ డీఈలతో కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. శ్మశాన వాటికలు, సిగ్రిగేషన్ షెడ్లు, రైతు కల్లాలు, నర్సరీల ఏర్పాటు తదితర అభివృద్ధి పనుల్లో పురోగతిపై చర్చించారు. జిల్లాలో 241 శ్మశాన వాటికలు, 241 సిగ్రిగేషన్ షెడ్లు, 1347 రైతు కల్లాలు ఉన్నాయని, పనుల్లో పురోగతి లేని రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, గణపురం మండలాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గడువులోగా పనులు పూర్తి చేయలని ఆదేశించారు. ప్రభుత్వ అనుమతి లేనిదే ఏ మండలంలో నైనా అక్రమ లే అవుట్లు, నిర్మాణాలు సాగితే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దివాకర, డీఆర్డీవో పురుషోత్తం, జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలు, డీఈలు పాల్గొన్నారు.