దేశానికి మోదీ చేసిందేమీలేదుఅంబానీ, అదానీ రైళ్లు కూడా రావొచ్చు
పుల్వామా దాడి పుణ్యమా అని మళ్లీ ప్రధాని అయ్యారు
కాంగ్రెస్ వైఫల్యమే బీజేపీకి బతుకు
బండి సంజయ్‌ది పోలీసులపై దాడి చేసే దీక్ష
ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్
ఎల్కతుర్తి, జనవరి 4 : ఎన్నికల్లో మేకిన్ ఇండియా నినాదాన్ని ఎత్తుకున్న మోదీ, ఇప్పుడు అన్ని ప్రభుత్వ రంగసంస్థలను అమ్ము తూ ప్రస్తుతం ఆ నినాదాన్ని సేల్ ఇండియాగా మార్చారని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. మండలంలోని సూరారం గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో దేశానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా కోటి ఉద్యోగాలిస్తామని, విదేశాల్లోని నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడంతోపాటు ప్రభుత్వ రంగసంస్థలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. మున్ముందు అంబానీ, అదానీ రైళ్లు కూడా రావొచ్చని ఎద్దేవా చేశారు. 2019లో పుల్వామా దాడి జరుగకుంటే మోదీ మళ్లీ ప్రధాని అయ్యేవారు కాదన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పూర్తిగా దివాళా తీయడంతో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారని చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యమే బీజేపీ బతుకన్నారు. కాంగ్రెస్‌కు నాయకుల్లేరని, ఇంకా రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ఏం చేస్తాడని ప్రశ్నించారు. బీజేపీది మత రాజకీయాలు తప్ప ఏం లేదన్నారు. తెలంగాణలో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని, హిందువులపై నిజంగా ప్రేమ ఉంటే భద్రాద్రిలో రామాలయం ఎందుకు కట్టలేదని అని ప్రశ్నించారు.
తెలంగాణలో కేసీఆర్ మాత్రం యాద్రాద్రిని కట్టి చూపారని తెలిపారు. రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు గెలిచి రాష్ర్టానికి కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారని అడిగారు. తాము పార్ల మెంట్లో ఒంటికాలు మీద నిలబడి నిరసన తెలిపి ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ర్టానికి తీసుకొచ్చామని గుర్తుచేశారు. 563 జాతీయ రహదారిని తాము సాధిస్తే, దానిపై ఇంతవరకు అతీగతీ లేదన్నారు. ఇక్కడి ఎంపీలు ఒక్క రోజైనా సమీక్ష జరిపారా? అని నిలదీశారు. బండి సంజయ్‌ది పోలీసులపై దాడి చేసే దీక్ష తప్ప మరొకటి కాదన్నారు. బీజేపీ నాయకులు కవ్వింపు చర్యలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని హితవుపలికారు. రాష్ట్ర ప్రజలు ప్రగతిశీల భావాలున్న వారని, దేశ సంపదను కొంతమంది చేతుల్లో పెడుతుంటే చూస్తూ ఊరుకోరని వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. అనంతరం శ్రీబాపూజీ చేనేత సహకార సంఘాన్ని సందర్శించి వస్ర్తాల తయారీపై ఆరా తీశారు. చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యార్‌తో ఫోన్లో మాట్లాడి కార్మికుల వస్ర్తాల గురించి వివరించారు. అనంతరం వినోద్‌కుమార్‌కు కొత్తకొండ జాతర ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి అందజేశారు.