23 నుంచి పల్స్‌పోలియో
జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ
వరంగల్‌చౌరస్తా, జనవరి 4: డిప్తీరియా టెటానస్ పెర్టుసిస్(డీటీపీ) టీకా కార్యక్రమంతోపాటు జనవరి 23న ప్రారంభం కానున్న పల్స్ పోలియోను విజయవంతం చేసేందుకు వైద్య సిబ్బంది సిద్ధం కావాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ ఆదేశించారు. జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన వైద్యాధికారులతో సమీక్షించారు. సరైన సమయంలో డీటీపీ టీకా తీసుకోని పిల్లలు డిప్తీరియా కారణంగా తరచూ జ్వరం, గొంతు నొప్పి, దనుర్వాతం, నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారన్నారు. నడుం భాగం వంగిపోయిన పిల్లలను గుర్తించేందుకు సర్వే నిర్వహించాలని సూచించారు. పల్స్‌పోలియో కార్యక్రమంలో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్లలోపు వారికి చుక్కల మందు వేయాలన్నారు. మండలస్థాయి, ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. సమీక్షలో అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ మధుసూదన్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ ప్రకాశ్, పీహెచ్‌సీల వైద్యాధికారులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
వరంగల్‌చౌరస్తా/కరీమాబాద్/చెన్నారావుపేట: జిల్లావ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నదని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ తెలిపారు. మంగళవారం 4722 మందికి వ్యాక్సిన్ వేశామని, అందులో 325 మందికి మొదటి డోసు, 4397 మందికి రెండో డోసు టీకాలు వేశామన్నారు. జిల్లాలో 15 నుంచి 18 ఏళ్లలోపు 489 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు వివరించారు. చెన్నారావుపేట మండల పరిధిలో అత్యధికంగా మంగళవారం 110 మం ది టీకాలు వేసుకున్నారన్నారు. రెండు రోజుల్లో సంగెం మండలంలో అత్యధికంగా 158 మందికి వ్యాక్సిన్ అందించినట్లు వెల్లడించారు. చెన్నారావుపేట పీహెచ్సీలో 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్న వైద్యాధికారి ఉషారాణి తెలిపారు. మొదటి రోజు 23 మంది, రెండో రోజు 110 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. వరంగల్ కరీమాబాద్ ప్రాంతంలో పిల్లలకు టీకాలు వేస్తున్నారు. రంగశాయిపేట సెంటర్లో వ్యాక్సినేషన్‌ను కార్పొరేటర్లు పోశాల పద్మ, గుండు చందన పరిశీలించారు. సమష్టిగా వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని వారు పిలుపునిచ్చారు. వారి వెంట గుండు పూర్ణచందర్, డాక్టర్ నాగరాజు ఉన్నారు.