వరంగల్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావుకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వనీర్ సతీశ్‌రెడ్డి, టీఆర్ఎస్వీ నాయకుడు సూర్యకిరణ్ తదితరులు మంగళవారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ దేశంలోనే బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచినందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇటీవల కరోనా బారిన పడి కొన్ని రోజులుగా హోం ఐసొలేషన్‌లో ఉన్న ఎర్రబెల్లి పూర్తిగా కోలుకుని మంగళవారం బయటికి వచ్చారు.