ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో అంతటా ర్యాలీలు
కదిలి వచ్చిన రైతులు, టీఆర్ఎస్ నాయకులు
కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు
మార్మోగిన ‘జై కేసీఆర్.. జై రైతుబంధు’ నినాదాలు
పాల్గొన్న ఎమ్మెల్యేలు గండ్ర, ముత్తిరెడ్డి, శంకర్‌నాయక్
భూపాలపల్లి టౌన్, జనవరి 4;ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుబంధు సంబురాలు పండుగలా జరిగాయి. వారోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం రైతులు, టీఆర్ఎస్ నాయకుల ర్యాలీలు, ఎడ్లబండ్లపై ఊరేగింపులు, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, ఇండ్ల ముందు ముచ్చటగొలిపే ముగ్గులు.. ఇలా ఊరూవాడన వేడుకలా సాగాయి. పలుచోట్ల రైతులు తమ పంట పొలాల్లో జై ‘కేసీఆర్’, జై ‘రైతుబంధు’ రూపంలో నారుపోసి ముఖ్యమంత్రి మీదున్న అభిమానం చాటుకున్నారు. అలాగే పాఠశాలల్లో ‘వ్యవసాయం-దాని ప్రాముఖ్యత’పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎడ్లబండ్ల ర్యాలీలు జోరుగా నిర్వహించారు. దారి పొడవునా సాగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని స్వయంగా ఎడ్లబండి నడిపారు. ఆ తర్వాత గ్రామ కూడలిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలతో అభిషేకం చేసి రైతుబంధు ఇస్తున్నందుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో వేడుకలా జరుగుతున్న సంబురాలను చూస్తుంటే సంక్రాంతి పండగుముందే వచ్చినట్లు అనిపిస్తోందని గండ్ర సంతోషంవ్యక్తంచేశారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన సంబురాల్లో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పాల్గొన్నారు. మండలకేంద్రం నుంచి ఎడ్లబండిపై ర్యాలీగా బయల్దేరిన మార్కెట్ వరకు, ఆ తర్వాత స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ముందుకుసాగారు. అనంతరం మార్కెట్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పల్లెనిద్ర చేసిన నెల్లికుదురు మండలం జామతండాలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ బాలాజీనాయక్ ఆధ్వర్యంలో పంట పొలాల్లో ‘జై కేసీఆర్’.. ‘జై రైతుబంధు’ ఆకృతిలో నాట్లు వేసి అభిమానం చాటుకున్నారు. అలాగే మహబూబాబాద్ మండలం అమనగల్‌లో మహిళా రైతులు తమ ఇంటి ముందు వేసిన ముగ్గు ఆకట్టుకున్నది. చుట్టూ పెద్దచక్రం.. మధ్యలో ఓ చేత నగదు, మరోచేతిలో పాస్‌పుస్తకం పట్టుకున్న రైతు ముగ్గును అందంగా వేశారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలకేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాట్లు వేస్తున్న రైతులు, కూలీల వద్దకు వెళ్లి రైతుబంధు పథకం ప్రయోజనాలతో పాటు కేసీఆర్ సర్కారు అమలుచేస్తున్న రైతు సంక్షేమం గురించి అవగాహన కల్పించారు.
హనుమకొండ జిల్లాలో సంబురాలు ఘనంగా నిర్వహించారు. హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లోని పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి జై కేసీఆర్ అంటూ జైకొట్టారు. అలాగే ఐనవోలు మండలంలో రైతుబంధు సమితి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు పాల్గొని పంట పొలాల దాకా ర్యాలీ నిర్వహించారు. అలాగే భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, ఆత్మకూరు మండలాల్లో సంబురాలు పండుగలా జరిగాయి.
వరంగల్ జిల్లాలో సంబురాలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ నాయకులు, రైతులు.. ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
జనగామ జిల్లాకేంద్రంలోని క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కార్యకర్తలతో సమావేశమై సంబురాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.