తెలంగాణ పథకాలు, ప్రాజెక్టులు దేశానికే ఆదర్శం
రైతుబంధుతో గ్రామాల్లో అన్నదాతలు సంబురాలు
సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుంది
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ పథకాలున్నాయా
పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు.. మరి కాళేశ్వరానికేది?
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
గొర్లవీడులో రైతులతో కలిసి ఎడ్లబండ్ల ర్యాలీ
భూపాలపల్లిటౌన్, జనవరి 4 : సీఎం కేసీఆర్ రైతు నా యకుడని, అన్నదాతల కష్ట సుఖాలు తెలిసిన నేత అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామం లో సర్పంచ్ తాటికంటి శంకరయ్య అధ్యక్షతన రైతు బంధు సంబురాలు ఘనంగా జరిగాయి. రైతులు ఎడ్ల బండ్లతో గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ కూడలి వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం గండ్ర మాట్లాడుతూ రైతుల సంబురాలు చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చిననట్లు కనిపిస్తుందన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనని చెప్పడంతో రైతుబంధు వస్తదో రాదో అనే సందేహంలో రైతులకు సీఎం కేసీఆర్ రూ.50 వేల కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇవ్వకపోగా అడ్డుకోవడానికి అనేక అడ్డంకులు సృష్టించారని అన్నారు. అయినా సీఎం కేసీఆర్ ధైర్యంతో ముందుకు సాగి ప్రాజెక్టును పూర్తి చేశారని గుర్తు చేశారు. చివరి ఆయకట్టు వరకూ సాగునీరందిస్తునారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములు సమస్యల్లో ఉంటే వాటిని పరిష్కరించి పాస్‌బుక్కులు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని గుర్తు చేశారు. ప్రభుత్వ పనితీరును గుర్తించి 10 రోజుల పాటు రైతుబంధు సంబురాలు జరుపుకుంటూ సీఎంకు అండగా ఉందామన్నారు.
పాఠశాల సందర్శన
గొర్లవీడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగు నీటి సమస్య ఉందని విద్యార్థులు తెలుపడంతో వెంటనే పరిష్కరించాలని సర్పంచ్‌కు సూచించారు. అలాగే పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. టీనేజర్లందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలని కోరారు. సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు 317 జీవో రద్దుకు కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మందల లావణ్య, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మందల విద్యాసాగర్‌రెడ్డి, సర్పంచులు కాసగాని కవితా దేవేందర్, తాళ్లపల్లి స్వామి, ఉడుత లక్ష్మీ ఐలయ్య, ఉప సర్పంచ్ మైనొద్దీన్, మండల వ్యవసాయ అధికారి సతీశ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పినగాని నర్సయ్య, పింగిళి రవీందర్‌రెడ్డి, గానవేన రమేశ్, వేల్పుల రాజబాబు, మామిగి రాజ్‌కుమార్, మేర తిరుపతి, మూగ రాజు, బొనగాని రమేశ్, గౌడ మహేశ్, కౌటం లక్ష్మయ్య, చంటి, ఎడ్ల నరేశ్, దుండ్ర మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.