వైరస్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు
ఉమ్మడి జిల్లాలో 1,729 ఆక్సిజన్ బెడ్లు
అందుబాటులో1,954 సర్వే బృందాలు
నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు
మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి జరిమానా
వరంగల్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. వైరస్ నిర్ధారణ పరీక్షలను పెంచడంతోపాటు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 1,729 ఆక్సిజన్ బెడ్లు, 80 ఐసీయూ, 879 ఐసీయూ వెంటిలేటర్ బెడ్లను అధికారులు అందుబాటులో ఉంచారు. గతంలో మాదిరిగా ఇంటింటా సర్వే కోసం 1,954 బృందాలను సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చేవారికి జరిమానా విధిస్తామని పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం మాస్క్ ప్రచార వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఒమిక్రాన్ రూపంలో వస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచడం, బాధితులకు మెరుగైన వైద్య సాయం అందిస్తోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణలో కీలకమైన మాస్కులు ధరించడంపై కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. మాస్కులు ధరించని వారిపై ఒకింత కఠినంగానే వ్యవహరిస్తోంది. సోమవారం నుంచి ఈ దిశగా చర్యలు పెంచింది. మంగళవారం నుంచి పోలీసులు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగారు. వరంగల్ నగరంతోపాటు చాలా ప్రాంతాల్లో మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వారికి పోలీసు శాఖ జరిమానాలు విధించింది. మాస్కులు లేకుండా తిరిగేవారి విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి స్పష్టం చేశారు. ఈ మేరకు హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మాస్క్ ప్రచార వాల్ పోస్టర్‌ను అడిషనల్ డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సాయి చైతన్యతో కలిసి సీపీ ఆవిష్కరించి మాట్లాడారు. వాహనదారులతోపాటు సాధారణంగా తిరిగే వారు సైతం కచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పారు. రోడ్లపైనే కాకుండా అన్ని ప్రాంతాల్లోని ప్రజలు మాస్కు ధరించేలా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో ఒకరికొకరు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ ప్రాంతాలకు వచ్చే వారిని మాస్కులు ధరించేలా చూడాలని, దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని ఆయా వాణిజ్య, వ్యాపార సముదాయాల నిర్వాహకులకు పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉమ్మడి జిల్లాలో 1729 ఆక్సిజన్ బెడ్లు
కరోనాతోపాటు దీంట్లోనే కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కరోనా బాధితుల వైద్య సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ హాస్పిటళ్లతోపాటు ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ ఆక్సిజన్, మందులను నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అన్ని జిల్లాల్లోనూ టెస్టుల సంఖ్యను పెంచుతోంది. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను ఇప్పటికే పెంచింది. వీటికి నిరంతరం ఆక్సిజన్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో కలిపి 1729 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. 80 ఐసీయూ, 879 ఐసీయూ వెంటిలేటర్ బెడ్లు అందుబాటులో ఉంచారు. వైరస్ తీవ్రతను బట్టి మరిన్ని చర్యలు తీసుకుంటోంది. కరోనా బాధితులను గుర్తించి సత్వరం వైద్య సేవలు అందించేందుకు వీలుగా గతంలో ఇంటింటి సర్వే కోసం ఆరు జిల్లాలో కలిపి 1954 బృందాలు ఉన్నాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో గతంలో ఏర్పాటు చేసినట్లుగా ఐసొలేషన్ సెంటర్లు, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లతోపాటు క్వారంటైన్ కేంద్రాల పునరుద్ధరణకు వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది.