లింగాలఘనపురం, డిసెంబర్ 3 : బంధువు అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దంపతులతోసహా తనయుడు దుర్మరణం చెందిన ఘటన విషాదం నింపింది. జనగామ- సూర్యాపేట జాతీయ రహదారిపై జనగామ జిల్లా వనపర్తి సమీపంలో కారు టైరు పగిలి బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. లింగాలఘనపురం ఎస్సై రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చందానగర్‌లోని పాపిరెడ్డి కాలనీకి చెందిన జిన్న శేఖర్‌రెడ్డి(65)కి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ధనలక్ష్మి(62), కుమారుడు రఘుమారెడ్డి(28)తో కలిసి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగే తన బావ సందేపెల్లి నర్సింహారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం కారులో బయలు దేరారు. రఘుమారెడ్డి కారు నడుపుతుండగా లింగాలఘనపురం మండ లం వనపర్తి గ్రామం దాటగానే ముందు టైరు పగిలిపోయింది. దీంతో అదుపుతప్పిన కారు తుమ్మలగూడెం నుంచి నవాబుపేట అంగడికి బర్రెల లోడుతో వేగంగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో కారు ముందు భాగం నుజ్జనుజ్జయి శేఖర్‌రెడ్డి, ధనలక్ష్మి, రఘుమారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. బొలొరో వాహన డ్రైవర్ రమేశ్‌కు, మూడు బర్రెలకు తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్ధలాన్ని స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ రఘుచందర్, జనగామ సీఐ వినయ్‌కుమార్ సందర్శించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను పోలీసుల సహాయంతో బయటకు తీశారు. శవ పంచనామా అనం తరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం జనగామలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రోడ్డు ప్ర మాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి వివరించారు.
20 నిమిషాలైతే గమ్యం చేరేవారు !
హైదరాబాద్ నుంచి ఓ కారులో బంధువులు, తన సొంత కారులో కుటుంబ సభ్యులతో కలిసి శేఖర్‌రెడ్డి శుక్రవారం ఉదయం 8 గంటలకు బయలు దేరారు. మరో 20 నిముషాల్లో గమ్యానికి చేరుకునే లోపే ఘోరం జరిగి పోయింది. ముందు కారులో వెళ్తున్న బంధువులు శేఖర్‌రెడ్డితో ఎప్పటికప్పుడు ఎక్కడి వరకు వచ్చారంటూ సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉన్నా రు. వనపర్తి దాటాక రోడ్డు ప్రమాదం జరగడంతో విష యం తెలుసుకుని ఘటనా స్ధలానికి చేరుకుని జరిగిన ఘోరాన్ని చూసి విలపించారు. కాగా, శేఖర్‌రెడ్డి రెండో భార్య రమణికి ఇధ్దరు వివాహమైన కూతుళ్లు ఉండగా, మొదటి భార్య ధనలక్ష్మి కుమారుడు రఘుమారెడ్డి ఒక్కడే. సంవత్సరం క్రితమే దివ్యతో అతడికి వివాహమైంది. రోడ్డు ప్రమాదంలో దంపతులతోపాటు కుమారుడు మృతి చెందడంతో విషాదం అలుముకుంది.