ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దపులి సంచారం
ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో ప్రత్యక్షం
తాజాగా మహాముత్తారం, మల్హర్ మండలాల్లో ..
వెంట్రుకలు, మలం సేకరించిన అటవీ అధికారులు
హాని తలపెడితే కఠిన చర్యలు : ఎఫ్ఆర్వో దివ్య
మహాముత్తారం, డిసెంబర్ 3 : పెద్దపులి వరంగల్ ఉమ్మడి జిల్లాలో హాట్టాపిగ్గా మారింది. ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాలో దాని పాదముద్రలు కనిపించడం, స్థానికులు అధికారులకు సమాచారం చేరవేయడం వారు వచ్చి పెద్దపులిగా నిర్ధారించడం నిత్యం జరుగుతూనే ఉంది. అది మొదట మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గూడూరు మండలాల్లో కనిపించింది. అక్కడి నుంచి వరంగల్ జిల్లా పాకాల అడవుల్లో ప్రత్యక్షమైంది. మళ్లీ ములుగు జిల్లా ములుగు మండలంలోని రాయినిగూడెం, అక్కడి నుంచి వెంకటాపూర్ మండలం రామకృష్ణాపూర్ అడవుల్లో సంచరించింది. తాజాగా మహాముత్తారం మండలంలోని పోలారం గ్రామ పరిధి ఉట్లపల్లి, మల్హర్ మండలం రుద్రారం, తాడిచెర్ల, కాపురం అటవీ పరిధిలోకి చేరినట్లు తెలుస్తున్నది.
మహాముత్తారం మండలంలోని పోలారం గ్రామ పంచాయతీ పరిధి ఉట్లపల్లి గ్రామ పల్లెప్రకృతి వనం సమీపంలో శుక్రవారం పెద్దపులి పాద ముద్రలను గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచార అందించారు. విషయం తెలుకున్న ఆజంనగర్ ఫారెస్టు రేంజర్ గూడూరు దివ్వ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఉట్లపల్లి అడవిలోని కొత్తకుంటలో పులి నీరు తాగినట్టు పాదముద్రల ఆధారంగా అటవీ అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి గ్రామ పల్లెప్రకృతి వనాన్ని ఆనుకుని ఉన్న పొద కింద సేదతీరినట్లు మలం, రాలిన వెంట్రుకలను చూసి నిర్ధారించారు. పాద ముద్రలను కొలువడంతో 16 సెంటీమీటర్ల పొడవు, 16 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నట్లు రేంజర్ దివ్య తెలిపారు. పులి అడుగుల ఆధారంగా సిబ్బంది అడివిలోకి వెళ్లగా వారికి ఒక రకమైన వాసన రావడంతో వెనుదిరిగారు. పులి ఇదే ప్రాం తంలో ఉంటుందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. పులికి ఎలాంటి హాని తలపెట్టొద్దని ఎఫ్ఆర్వో దివ్య ప్రజలను కోరారు. సాయంత్రం ఐదు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఉపాధి హామీ కూలీలు, పశువుల కాపరులు, అడివిలోకి వెళ్లొద్దన్నారు. పులి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. మహాముత్తారం డీఆర్వో అధిల్, మహబూబ్పల్లి, పోలారం బీట్ ఆఫీసర్లు పవన్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మల్హర్ మండలంలో..
మల్హర్ : మండలంలోని అటవీ గ్రామాల పరిధిలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. మహాముత్తారం మండలం ఆజంనగర్, పోలారం అటవీ ప్రాంతాల మీదుగా పులి మల్హర్ మండలం రుద్రారం, తాడిచెర్ల, కాపురం అటవీ పరిధిలోకి చేరుకున్నట్లు రేంజ్ ఆఫీసర్ కిరణ్కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయా గ్రామాల శివారులో నిఘా ఉంచామని తెలిపారు. వంట చెరుకు కోసం అడవులకు వెళ్లకూడదన్నారు. అలాగే రైతులు పంట పొలాల వద్ద అడవి పందుల కోసం విద్యుత్ తీగలను ఉచ్చులుగా పెడుతున్నారని, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.