‘హరిత నిధి’.. పర్యావరణ పెన్నిధి అంటూ హర్షం
పచ్చదనానికి మరింత ఊతం
గ్రీన్ ఫండ్’కు సర్వత్రా సంఘీభావం
భాగస్వామ్యం కోసం స్వచ్ఛందంగా ముందుకు
జిల్లాలో సత్ఫలితాలిస్తున్న ‘హరితహారం’
సర్కారు కృషితో పెరుగుతున్న అటవీ విస్తీర్ణం
జయశంకర్ భూపాలపల్లి/ములుగు, అక్టోబర్ 3 (నమస్తేతెలంగాణ): ‘తెలంగాణకు హరితహారా’న్ని నిరంతరం కొనసాగించాలనే మహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాన్ని జిల్లా ప్రజానీకం స్వాగతిస్తున్నది. పచ్చదనానికి మరింత ఊతమిచ్చేందుకు ఏర్పాటు ‘హరిత నిధి’ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ‘గ్రీన్ ఫండ్’కు తమవంతుగా విరాళం ఇచ్చేందుకు చాలా మందిలో ఉత్సాహం కనిపిస్తున్నది. 2015 నుంచి విడుతల వారీగా కొనసాగుతున్న హరితహారం కార్యక్రమం ద్వారా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. వాతావరణ సమత్యులత కోసం 33శాతం వనాలను వృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమ లు చేస్తున్న హరితహారం సత్ఫలితా లు ఇస్తున్నది. 2021లో జయశంకర్ జిల్లాలో 27.29 లక్షల మొక్క లు నాటాలని అధికార యంత్రాం గం లక్ష్యం పెట్టుకొని 81 శాతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. జిల్లాలో అడవుల విస్తీర్ణం 74శాతానికి పెరిగింది. ఇప్పటికే అడవుల జిల్లాగా ఉన్న ములుగు మరింత శోభను సంతరించుకుంది. ఇక పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలతో ఊర్ల రూపురేఖలే మారిపోయాయి. వీటితో గ్రామాలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఇంటింటికీ ఆరు మొక్క లు పంపిణీ చేయడం ద్వారా, ఇండ్ల పరిసరాలు, వీధులన్నీ నందనవనాలను తలపిస్తున్నాయి. అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా రహదారులకు పచ్చని కళ వచ్చింది.
గ్రీన్ ఫండ్‌తో మరింత గ్రీనరీ
ప్రజాభాగస్వామ్యంతో ఏర్పాటయ్యే హరిత నిధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల నేతనాల నుంచి ప్రతి నెలా కొంత సొమ్ము జమ చేస్తారు. అన్ని రకాల కాంట్రాక్టు బిల్లుల చెల్లింపు నుంచి 0.1శాతం హరితనిధికి తీసుకుంటారు. వ్యాపార, వాణిజ్య సంస్థల లైసెన్స్ రెన్యూవల్ సమయంలో హరిత నిధి కింద ప్రతి రెన్యూవల్‌కు రూ.100 జమచేస్తారు. భూ క్రయ విక్రయాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి రిజిస్ట్రేషన్‌కు రూ.50 చొప్పున హరితనిధి కింద జమచేసే ఏర్పాట్లు చేశారు. ఇక విద్యార్థుల్లోనూ సామాజిక స్పృహ, హరితహారంపై మరింత అవగాహన పెంచేందుకు, మొక్కల సంరక్షణలో వారి పాత్ర ఉందనే భావన కలిగించేందుకు విద్యాలయాల్లో ప్రవేశాలు పొందే సమయంలో నామ మాత్రపు రుసుమును హరితనిధికి జమ చేస్తారు. నిరంతర నిధి సమీకరణ ద్వారా ఇక హరితహారం నిరంతరం కొనసాగనుండగా పుడమి తల్లి పచ్చల హారాలు ధరించి మురిసిపోనుంది. ఇప్పటికే పచ్చదనంతో కళకళలాడుతున్న జిల్లాల్లో గ్రీనరీ మరింత పెరిగే అవకాశం ఉంది. 2015లో నాటిన మొక్కలు ఏడేళ్లలో వృక్షాలుగా మారి చిట్టడివిని తలపిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాలు ప్రజలకు ఆహ్లాదం పంచుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు పచ్చదనాన్ని పంచుతూ ప్రజలకు మంచి వాతావరణాన్ని అందిస్తున్నాయి.