బాధితులకు అండగా నిలవండి
పోలీస్ అధికారులకు ఎస్పీ సురేందర్‌రెడ్డి ఆదేశాలు
ప్రజాదివస్‌లో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
భూపాలపల్లి, జనవరి 3 : సమస్యలు సత్వరమే పరిష్కరించి బాధితులకు అండగా నిలువాలని ఎస్పీ సురేందర్‌రెడ్డి జిల్లాలోని పోలీస్ అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొదటగా జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజాదివస్ నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి బాధితుల గోడును విని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. తనకు ఒక్కడే కుమారుడని ఇల్లు, భూమి తీసుకుని ఇంటి నుంచి గెంటివేశాడని కాటారం మండలానికి చెందిన ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. మహదేవపూర్ మండలానికి చెందిన ఓ మహిళ తన భర్తపై కొంత మంది దాడి చేశారని తాము కేసుపెట్టగా జైలుకు పోయినవారు తిరిగి బయటకు వచ్చి బెదిరిస్తున్నారని రక్షణ కల్పించాలని ఎస్పీని వేడుకుంది. బాధితుల సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ చట్టపరిధిలో సత్వర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కాటారం, మహదేవపూర్ ఎస్హెచ్లను ఫోన్లో ఆదేశించారు.
ఎస్పీని కలిసిన నాయకులు
ఎస్పీ సురేందర్‌రెడ్డిని సోమవారం సాయం త్రం ఎయిర్‌బస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సురేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 10వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని, లేకపోతే రూ. వెయ్యి జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో విధిగా కొవిడ్-19 నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.