వనదేవతల సన్నిధిలో భక్తుల కోలాహలం
గద్దెల వద్ద మొక్కుల చెల్లింపు
తాడ్వాయి, జనవరి 3 : మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేదుకు భక్తులు సోమవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహాజాతర సమీపిస్తుండటంతో వనదేవతల దర్శనానికి భారీగా తరలిస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
వనదేవతలను దర్శించుకున్న నేతలు
నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్ఎప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేశ్‌రెడ్డి కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు. వారికి దేవాదాయశాఖ అధికారులు, పూ జారులు, తాడ్వాయి ఉప సర్పంచ్ ఆలేటి ఇంద్రాసేనారెడ్డి, టీఆర్ఎప్ మండల అధ్యక్షుడు నూషెట్టి రమేశ్ ఘన స్వాగతం పలికి తల్లుల గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా తల్లులకు చారె, సారె, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారివెంట పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బండారి చంద్రయ్య, నాయకులు శివయ్య ఉన్నారు.
చేతి పంపుల మరమ్మతులు
మేడారం జాతర పరిసరాల్లోని చేతి పంపులను సోమవారం ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు మరమ్మతులు చేశారు. విడిది చేసే భక్తులకు తాగునీటిని అందించేందుకు నిరుపయోగంగా ఉన్న సుమారు 350 చేతి పంపులకు ఫ్లస్సింగ్ చేస్తున్నారు.