చల్వాయి, పస్రా, నేతాజీనగర్‌లో పూర్తి
గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులు
గోవిందరావుపేట, పాపయ్యపల్లిలో కొనసాగుతున్న పనులు
గోవిందరావుపేట, అక్టోబర్ 2 : నిరుపేదల ఆకాంక్షలకనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం వారికి నిలువనీడ కల్పిస్తూ సొంతింటి కళ నెరవేరుస్తున్నది. సమైక్య పాలనలో గుడిసెల్లో నివసించి నానా ఇబ్బందులుపడిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. గోవిందరావుపేట మండలంలో రూ.8.76 కోట్లతో 175 రెండు పడక గదుల ఇళ్లు మంజూరయ్యాయి. చల్వాయి, పస్రా, నేతాజీనగర్‌లో లబ్ధిదారులు ఇప్పటికే గృహప్రవేశం చేశారు. గోవిందరావుపేట, పాపయ్యపల్లిలో నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రెండు నెలల్లో ఈ గ్రామాల్లోని పేదల కళ సాకారం కానుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిరుపేదలకు నిలువ నీడ కల్పించి ఆదుకోవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ చేపట్టిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం మండలంలో శరవేగంగా కొనసాగుతున్నది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కళ నెరవేరుస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ భూ ములతో పాటు లబ్ధిదారుల ఇంటి స్థలాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. సమైక్య పాలనలో నిరుపేదలకు గృహా నిర్మాణం పూర్తి కాలేదు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5.6 లక్షలు మంజూరు చేసింది. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. మండలంలోని ఐదు గ్రామాల్లో రూ. 8 కోట్ల 76 లక్షల నిధులతో 175 ఇండ్లు మంజూరయ్యాయి. చల్వాయి, పస్రా, నేతాజీనగర్‌లో నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు సైతం గృహప్రవేశం చేశారు. గోవిందరావుపేట, పాపయ్యపల్లి గ్రామాల్లో నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లో పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలకు లబ్ధిదారులు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వ భూముల్ల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
చల్వాయిలోని హాస్టల్ గడ్డ సమీపంలోని పోచంపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించింది. వీటిని ఇళ్లలేని ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా వారు నేడు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నారు. గతం లో పూరి గుడిసెలో ఉంటూ ఎండ కు ఎండుతూ, వానకు తడుస్తూ జీవనం కొనసాగించిన నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించడంపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గోవిందరావుపేట గ్రామంలోని తారకరామ కాలనీతో పాటు నేతాజీనగర్‌లోని నిరుపేదలు ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ స్థలం లేనప్పటికీ వారి వారి స్థలాల్లోనే ప్రభుత్వం అందించిన నిధులతో గృహాలు నిర్మించుకున్నారు. పాపయ్యపల్లి గ్రామంలో 40, గోవిందరావుపేటలో 38 ఇండ్లు మంజూరవగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొసాగుతున్నాయి.
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టింది. మాకు గృహాలు కేటాయించడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన డబుల్బెడ్రూమ్ ఇండ్లలో ఆనందంగా ఉంటున్నాం. ఆయనకు మా కుటుంబం రుణపడి ఉంటుంది.
-సమ్మక్క, నేతాజీనగర్
తెలంగాణ ప్రభుత్వంలోనే న్యాయం
తెలంగాణ ప్రభుత్వంలో దళితులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. మా తాత ముత్తాతల నుంచి పూరి గుడిసెల్లో నివసించే వారు. కానీ నేడు మా బతుకులను గుర్తించి ప్రభుత్వ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వడం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మేము రుణపడి ఉంటాం.