మెరుగుపడుతున్న బొగ్గు ఉత్పత్తి
సింగరేణిలో పని స్థలాల పెంపు
ఎస్డీఎల్ యంత్రాల పనితీరు భేష్
భూపాలపల్లి ఏరియాలో మెరుగుపడుతున్న బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి, సెప్టెంబర్ 2 : బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ లక్ష్య సాధనవైపు అడుగులు వేస్తున్నది. కరోనా కారణంగా సమస్యలతో తడబడి నేడు వాటిని అధిగమిస్తోంది. గనుల్లో పని స్థలాల కొరత, కార్మికులు సరిగా హాజరుకాకపోవడంతో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి జరుగలేదు. ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం టెస్ట్‌ల సంఖ్య పెంచడమే కాక, ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేయించింది. దీంతో కార్మికుల హజరు శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 23 వరకు 15,66,880 టన్నుల లక్ష్యానికి గాను, 7,71,422 టన్నుల (49 శాతం) బొగ్గు ఉత్పత్తి జరిగింది. టీపీడీ / ఎస్డీఎల్ 76గా ఉంది. గనుల్లో మొత్తం 36 ఎస్డీఎల్ యంత్రాలు ఉండగా రోజుకు 115 టన్నుల బొగ్గును ఎత్తిపోస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం యంత్రాల పనితీరు గణనీయంగా మెరుగుపడింది.
నాడు సమస్యలతో సతమ తమైన భూపాలపల్లి సింగరేణి ఏరియా, నేడు వాటిని అధిగమిస్తూ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నది. పనిస్థలాలు పెంచుకుని, ఎస్డీఎల్ యంత్రాల సాయంతో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెంచుకుంటున్నది. గత ఆర్థిక సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తితో కార్మికుల గైర్హాజరు శాతం పెరుగడంతో పాటు గనుల్లో పనిస్థలాల కొరత, మరోవైపు మెడికల్ ఇన్వ్యాలిడేషన్ అవుతున్న కార్మికుల సంఖ్య అధికంగా ఉండడంతో బొగ్గు ఉత్పత్తి ఆశించిన స్థాయిలో జరుగలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి యాజమాన్యం ఉద్యోగులకు వ్యాక్సినేషన్, టెస్టుల పెంపు, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనాను కట్టడి చేస్తూ వస్తోంది. తద్వారా కార్మికుల గైర్హాజరు శాతం తగ్గుముఖం పట్టింది. మరోవైపు బొగ్గు గనుల్లో పని స్థలాలను పెంచుతూ సింగరేణి అధికారులు ముందుకు సాగుతున్నారు. గతంలో కంటే గణనీయంగా మెరుగుపడినప్పటికీ, ఇంకా అన్ని గనుల్లో మిగతా ఎస్డీఎల్ యంత్రాలు ప్రతి రోజూ అన్ని షిఫ్టుల్లో నడువాలంటే పని స్థలాలు పెంచాల్సిన అవసరం ఉందని, అప్పుడే లక్ష్యసాధన సాధ్యమవుతుందని ఓ సీనియర్ సింగరేణి అధికారి వాఖ్యానించారు.
ఎస్డీఎల్ యంత్రాల పనితీరు భేష్
కేటీకే 1, 5, 6, 8 భూగర్భ గనులతోపాటు, కేటీకే ఓసీపీ-2, ఓసీపీ-3 ఉపరితల గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. భూగర్భ గనుల్లో మొత్తం 36 ఎస్డీఎల్ యంత్రాలు ఉన్నాయి. ప్రతి యంత్రం రోజుకు 130 టన్నుల బొగ్గును ఎత్తిపోయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం గతంలో కంటే మెరుగ్గా రోజుకు 115 టన్నుల వరకు ఎత్తిపోస్తున్నప్పటికీ గనుల్లో పూర్తి స్థాయిలో పని స్థలాలు లేక ఒకటి, రెండు యంత్రాలు ఖాళీగా ఉంటున్నాయి. సంస్థ మాత్రం అన్ని యంత్రాలు పనిలో ఉన్నట్లు పరిగణలోకి తీసుకుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం గనుల వారీగా ఎస్డీఎల్ యంత్రాల బొగ్గు ఎత్తిపోసేది 74 నుంచి 84 టన్నులు ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 32 టన్నుల నుంచి 77 టన్నులు మాత్రమే ప్రతి రోజూ బొగ్గును ఎత్తిపోశాయి. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం యంత్రాల పనితీరు గణనీయంగా మెరుగుపడింది.
పెరిగిన పనిస్థలాలు
భూగర్భ గనుల్లో పనిస్థలాల పెంపుపై అధికారులు దృష్టిసారించారు. అన్ని గనుల్లో పనిస్థలాలను మెరుగుపరుస్తూ వస్తున్నారు. తద్వారా ప్రతి గనిలో రెండు నుంచి మూడు ఎస్డీఎల్ యంత్రాలు అదనంగా నడుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తి పెరుగుతూ వస్తున్నది.
బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన 49 శాతం
భూగర్భ గనులు, ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో ఏరియాలో సంస్థ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 3,59,000 టన్నులు కాగా, 1,46,621 టన్నులు (41శాతం) బొగ్గును ఉత్పత్తి చేశారు. టన్స్ పర్ డే/ఎస్డీఎల్(టీపీడీ/ఎస్డీఎల్) యావరేజీ 74. మే నెలలో 3,59,000 టన్నుల సంస్థ నిర్దేశిత లక్ష్యానికి, 1,52,751 టన్నులు (43 శాతం) ఉత్పత్తి చేశారు. టీపీడీ/ఎస్డీఎల్ యావరేజీ 70. జూన్ నెలలో 3,62,000 టన్నుల సంస్థ నిర్దేశిత లక్ష్యానికి 1,89,976 టన్నులు (52శాతం) ఉత్పత్తి జరిగింది. టీపీడీ/ఎస్డీఎల్ యావరేజీ 75. జూలైలో 2,86,000 టన్నుల లక్ష్యానికి 1,55,217 టన్నులు (54 శాతం) జరిగింది. టీపీడీ/ఎస్డీఎల్ యావరేజీ 80. అదేవిధంగా ఈ నెలలో 2,00,880 టన్నుల లక్ష్యానికి 23వ తేదీ వరకు 1,26,857 టన్నులు (63 శాతం) బొగ్గు ఉత్పత్తి చేసింది. టీపీడీ/ఎస్డీఎల్ 82గా ఉంది. మొత్తానికి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 23 వరకు 15,66,880 టన్నుల లక్ష్యానికి 7,71,422 టన్నులు (49 శాతం) బొగ్గు ఉత్పత్తి జరిగింది. టీపీడీ / ఎస్డీఎల్ 76గా ఉంది.
గత ఆర్థిక సంవత్సరం
గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం 12,68,000 టన్నుల సంస్థ నిర్ధేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి కేవలం 4,74,936 టన్నులు (37 శాతం) బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగింది. టీపీడీ/ఎస్డీఎల్ యావరేజీ 54గా ఉంది.
ఉద్యోగులకు వ్యాక్సినేషన్
భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్ సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, కాంట్రాక్ట్ కార్మికులతో పాటు మరికొందరికి సింగరేణి సంస్థ ఇప్పటి వరకు 10,657 మందికి టీకా ఇప్పించింది. ఇందులో 6117 సింగరేణి ఉద్యోగులుండగా, మొదటి డోస్ 4,416 మందికి, రెండో డోస్ 1701 మందికి వ్యాక్సిన్ వేసింది. అలాగే భూపాలపల్లి ఏరియాలో గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సింగరేణి ఉద్యోగుల గైర్హాజరు అత్యధికంగా 44.9 శాతం ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై 31 వరకు గైర్హాజరు శాతం 25.4 మాత్రమే ఉంది.