అన్ని రంగాలపై ఎమ్మెల్యే నరేందర్ దృష్టి
శంభునిపేటలో కళాశాలకు భవనం
ఉర్సు బండ్‌తో ఆహ్లాదం
స్మార్ట్రోడ్లతో మెరుగైన రవాణా
ఆర్డీవో ఆఫీస్ ఏర్పాటుకు సన్నాహాలు
కరీమాబాద్, జనవరి 2: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో అండర్‌రైల్వేగేట్ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ సర్కారు హయాంలో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం.. మంత్రి కేటీఆర్ అండదండలతో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. కోట్లాది రూపాయల నిధులతో వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు.
శంభునిపేటలో డిగ్రీ కళాశాల..
శంభునిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డిగ్రీ కాలేజీని సైతం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల కలెక్టర్ గోపి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పొరేటర్ పోశాల పద్మ, అధికారులు స్థల పరిశీలన చేశారు. ఐదెకరాల స్థలంలో భవన నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక్కడే కొన్నాళ్లకు పీజీ కళాశాల సైతం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది. దీంతో శంభునిపేట ప్రాంత విద్యార్థులకు స్థానికంగా ఉన్నత విద్య అందే అవకాశం ఉంది.
మినీ మార్కెట్‌తో ఉపాధి
యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉర్సులోని నాగమయ్య గుడి ప్రాంతంలో దాదాపు మూడెకరాల స్థలంలో రూ. 4.5 కోట్లతో మినీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. మార్కెట్ నిర్మాణం పూర్తయితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రూ. 16 కోట్లతో ఉర్సు బండ్
అందమైన గుట్ట.. విశాలమైన స్థలం ఉన్న ఉర్సు చెరువు వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులతో పర్యాటకుల తాకిడి పెరుగడంతోపాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి రానుంది. రూ. 16 కోట వ్యయంతో ట్యాంక్ బండ్ నిర్మాణం చేపడుతున్నారు. దీంతోపాటు ప్రజలకు ఉపయోగపడేలా భారీ కల్చరల్ ఆడిటోరియం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
మెరుగైన రవాణాకు స్మార్ట్ రోడ్లు
కరీమాబాద్ ప్రధాన రహదారి నుంచి శంభునిపేట వరకు రూ. 22.70 కోట్లతో స్మార్ట్‌రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. దీంతోపాటు కరీమాబాద్‌లోని దసరారోడ్డు నుంచి ఉర్సుగుట్ట వరకు రూ. 8.40 కోట్లతో స్మార్ట్‌రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు రోడ్ల నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగనుంది.
ఆఫీసులకు అనువైన స్థలం..
ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వ కార్యాలయాలు ఎంతగానో దోహదం చేస్తాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే వారితో స్థానికులకు ఉపాధి లభిస్తుంది. ఈ మేరకు ఉర్సు బైపాస్ రోడ్డులో వరంగల్ ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనువైన ప్రభుత్వ స్థలం ఉండడంతోపాటు రవాణా వ్యవస్థ కలిగిన బైపాస్ రోడ్డులో ఈ కార్యాలయం ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.