కళాకారులు నిజమైన హీరోలు
ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్
వరంగల్ చౌరస్తా, జనవరి 2: సినిమా రంగానికి నాటక రంగం తల్లిలాంటిదని ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల కళాకారుల ఐక్య వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ స్టేషన్‌రోడ్‌లోని రాధాకృష్ణ గార్డెన్స్‌లో ఆదివారం రాత్రి 13వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ హాజరయ్యారు. వరంగల్ 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ మాట్లాడుతూ నేడు మల్టీఫ్లెక్స్‌ల స్థాయికి ఎదిగిన సినిమా రంగానికి నాడు నాటక రంగమే పునాది వేసిందన్నారు. భవిష్యత్‌లో నాటక రంగానికి మంచి రోజులు రావాలని ఆకాంక్షించారు. టేక్, కట్ అనే పదాలే లేకుండా జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపే నాటక రంగం కళాకారులే నిజమైన హీరోలని కొనియాడారు.
కళాకారుల కోసం సంక్షేమ పథకాలు
దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగిన సురభి కళారంగం తన ఉనికిని కోల్పోతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కళాకారులను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. ఆదివారం ప్రదర్శించిన నాటకాలు ప్రజలను ఆలోచింపజేసేలా ఉన్నాయని, ఇలాంటి నాటకాలు నేటి తరాలను ఎంతో ఆలోచింపజేస్తాయన్నారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ నాటక పోటీల్లో మొదటి రోజు హైదరాబాద్ విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ వారు ‘సాక్షి’, తాడేపల్లికి చెందిన అరవింద్ ఆర్ట్స్ వారు ‘జరుగుతున్న కథ’ నాటకలు ప్రదర్శించారు. సోమవారం రోజు పెదకాకాని వారు ‘అస్థికలు’, హైదరాబాద్‌కు చెందిన సిరిమువ్వ కల్చరల్స్ వారు ‘థింక్’ నాటకాలను ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీని నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన కళాకారులను సత్కరించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు నాటక రంగ అభిమానులు, కళాకారులు తరలిరావాలని ఆయన కోరారు.