వెంకటాపూర్, జనవరి 2 : మండలంలోని పాలంపేటలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయం ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సెలవురోజు కావడంతో కుటుంబంతో సహా సందర్శించారు. దాదాపు 15వేల మంది దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజరులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్ భక్తులకు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ చరిత్ర, విశిష్టతను టూరిజం గైడ్స్ వివరించగా ఆసక్తిగా విన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. అనంతరం రామప్ప సరస్సుకు చేరుకొని బోటింగ్ చేశారు.
శిల్పకళా సంపద.. అద్భుతం
రామప్ప దేవాలయాన్ని ఆదివారం పలువురు ప్రముఖులు వేర్వేరుగా సందర్శించారు. శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డితోపాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి దంపతులు, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి సందర్శించారు. వారికి తొలుత అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల తర్వాత తీర్థ ప్రసాదాలు అందించారు. మండపంలో శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ఆలయ చరిత్ర, శిల్పకళా ప్రాముఖ్యాన్ని టూరిజం గైడ్ ద్వారా తెలుసుకొన్న శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రామప్ప శిల్పకళ అద్భుతంగా ఉందని, గొప్ప ఆలయం మన రాష్ట్రంలో ఉండడం గర్వకారణం అన్నారు. ఎమ్మెల్యే వెంకటరామణారెడ్డి మాట్లాడుతూ రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం చాలా సంతోషకరమని, తెలంగాణ ప్రభుత్వం చొరవ వల్లే ఈ గుర్తింపు వచ్చిందని తెలిపారు. వరంగల్ సీపీ తరుణ్‌జోషి మాట్లాడుతూ రామప్ప ఆలయ శిల్పకళా చాలా బ్యూటీఫుల్ అన్నారు. గర్భగుడిలో నిత్యం వెలుతురు, నీటిలో తేలే ఇటుకలు, సాండ్ బాక్స్ టెక్నాలజీ నాటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమన్నారు. అనంతరం రామప్ప సరస్సుకు చేరుకొని బోటింగ్ చేసి సరస్సు అందాలను తిలకించారు. వారి వెంట ములుగు సీఐ గుంటి శ్రీధర్, ములుగు ఎస్సై లక్ష్మారెడ్డి, పోలీస్, రెవెన్యూ, పురావస్తు, టూరిజం, దేవాదాయ శాఖల సిబ్బంది ఉన్నారు. రామప్ప ఆలయాన్ని సినీనటుడు బిత్తిరి సత్తి కుటుంబ సభ్యులతోసహా సందర్శించారు. రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. రామప్ప శిల్పకళా సౌందర్యం మన అదృష్టమని అన్నారు. ఆయన వెంట పాలంపేట సర్పంచ్ డోలి రజిత శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
నేడు కాళేశ్వరం ప్రాజెక్టుకు భూపాల్‌రెడ్డి
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టును శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి సోమవారం సందర్శించనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కన్నేపల్లి(లక్ష్మీ) పంప్‌హౌస్, లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్, అన్నారం(సరస్వతి) బరాజ్‌లను తిలకిస్తారు. కాళేశ్వరంలోని కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో కుటుంబ సభ్యులతోపాటు పూజలు చేస్తారని ఈవో మారుతి పేర్కొన్నారు.