13 పీహెచ్‌సీల పరిధిలో 348 రోజుల్లో పూర్తి
1,63,790 మందికి రెండో డోస్
త్వరలో పూర్తి చేసేందుకు సిబ్బంది సమాయత్తం
ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచన
ములుగు, డిసెంబర్31(నమస్తేతెలంగాణ): కరోనా మహమ్మారి నుంచి రక్షణగా ప్రజలకు టీకాలు వేసే ప్రక్రియ ములుగు జిల్లాలో విజయవంతమైంది. 18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్ చేశారు. 2021 జనవరి 16న ప్రారంభమైన ఈ ప్రక్రియ 348 రోజులపాటు జిల్లాలో కొనసాగింది. జిల్లా, మండల వైద్యాధికారుల తోపాటు అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు టీకా ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. దీనికి తోడు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ చేశారు. 13 పీహెచ్‌సీల పరిధిలోని అర్హులైన 2,15,822 మందిని గుర్తించి డిసెంబర్ 30వ తేదీ నాటికి మొదటి డోస్ వ్యాక్సినేషన్‌ను వంద శాతం పూర్తి చేశారు. రెండో డోస్‌కు ప్రభుత్వం సూచించిన వ్యవధి ప్రకారం సమయం ఉండడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు 1,63,790 మందికి వ్యాక్సిన్ వేయగా 75.89 శాతం నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. కాగా, జిల్లాలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంలో కలెక్టర్, డీఎంహెచ్‌వో కృషి చేశారు.
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు ములుగు జిల్లాలో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వందశాతం పూర్తియింది. 2021 జనవరి 16వ తేదీన ప్రారంభమైన వ్యాక్సినేషన్ 348 రోజుల పాటు కొనసాగింది. జిల్లాలోని 13 పీహెచ్‌సీల పరిధిలో అర్హులైన 2,15,822 మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్‌ను డిసెంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేశారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య పర్యవేక్షణలో, డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్య కృషితో పూర్తయింది. మూడు రోజుల క్రితం మేడారం జాతర సమీక్షకు హాజరైన రాష్ట్ర మంత్రులు సత్యవతిరాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో కేక్ కట్ చేశారు. జిల్లా మొత్తం జనాభా 3,14,610 మంది ఉండగా ఇందులో 18 సంవత్సరాలకు పైబడిన వారి సంఖ్య 2,15,822 మందికి ఉన్నారు. వీరికి మొదటి డోస్ టీకా పంపిణీ వందశాతం పూర్తయింది. వీరిలో 1,63,790 మందికి రెండో డోస్ 75.89 శాతం పూర్తి చేశారు.
13 పీహెచ్‌సీలు.. 348 రోజులు
జిల్లాలోని మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో టీకా వేసుకునేందుకు ప్రజలు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నేరుగా వారి ఇళ్లకు వెళ్లి వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. ఫలితంగా 13 పీహెచ్‌సీల పరిధిలో 348 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వందశాతం పూర్తయింది. కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు ప్రతి రోజూ ప్రత్యేక ఉష్ణోగ్రత నడుమ తరలించి ప్రజలకు అందించారు. కొవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారితో పాటు అప్పటికప్పుడు టీకా కేంద్రాలకు వచ్చే వారి పేరు రిజిస్ట్రేషన్ చేసి టీకా వేశారు. టీకా తీసుకున్న వారి వివరాలు ఆన్లైన్ లో పొందుపరిచి సర్టిఫికెట్ పొందే సౌకర్యం కల్పించారు.
సమష్టి కృషితోనే సాధ్యమైంది
వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ప్రజలను కాపాడడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి కలెక్టర్ కృష్ణ ఆదిత్య నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు ఇతర శాఖల అధికారుల సహకారంతో వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం. ఏజెన్సీ గ్రామాలు అధికంగా ఉన్న జిల్లాలో ప్రజలకు టీకాపై అవగాహన కల్పించాం. వైద్యసిబ్బందితో పాటు ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది ఇందుకు కృషి చేశారు. –అల్లెం అప్పయ్య, డీఎంహెచ్‌వో