యాసంగికి 30వేలు పడ్డయ్
వాటితోని ఎరువులు, పురుగు మందులు కొంట
ఇదివరకు అప్పులే మీదవడేటియి
పంట చేతికి రాక ఆగమయ్యేది
ఎవుసం దండుగ అనుకున్న టైంల సీఎం కేసీఆర్ రైతు బంధు తెచ్చి పండుగచేసిండు
నమస్తే నెట్వర్క్;రైతుల మేలెంచి ‘రైతుబంధు’ ద్వారా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘పెట్టుబడి’.. అన్నదాతల జీవితాలనే మార్చి వేస్తున్నది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండడం, 24 గంటల పాటు ఉచితంగా కరంటు సరఫరా అవుతుండడం, ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా సాగునీటి వసతి కలుగడం, అదునుకు సర్కారు సాయం అందుతుండడంతో పంటలు పుట్లకు పుట్లు పండుతుండడం, ధాన్యాన్ని సర్కారే కొనుగోలు చేస్తుండడంతో రైతుల ఆర్థిక పరిస్థితిలో గణనీయంగా మార్పు వస్తున్నది. పెట్టుబడులకు అప్పులు చేసే బాధ తప్పి.. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో సాగు అవసరాలు తీరుతుండగా కర్షకుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. రైతుబంధు తమకు ఏవిధంగా ఆసరా అవుతున్నదో పలువురు రైతులు ఇలా తమ మనోగతాన్ని మన ముందుంచారు.
50వేలు పెట్టి పైపులైన్ ఏశిన..
నర్మెట, జనవరి 1 : రైతుబంధు పైసలు మంచిగ అక్కెరకు అచ్చినయ్. పాతయి కొన్ని కలిపి రెండు నెలల కింద రూ.50వేలు పెట్టి బాయి కాన్నుంచి మక్క చేను దాంక పైప్‌లైన్ ఏపిచ్చిన. మా కుటుంబంల అందరిది కలిపి ఆరెకురాల భూమి ఉంది. నీళ్లు లేక ఇదివరకు మా అమ్మనాయన శాన కష్టపడ్డరు. బాయిల నీళ్లు లేక పంటలు కూడ సక్కగ పండకపోయేది. పెట్టుబడి మందం కూడ రాక ఆడ ఈడ తెచ్చిన అప్పులు మీద పడేటియి. గిట్ల ఎన్నో ఏండ్ల సంది అనుకున్న పంట చేతికి రాక ఆగమైనమ్. ఎవుసం చేసుడు దండుగ అనుకున్నం. ఇంతల కేసీఆర్ సారు రైతుబంధు పథకం పెట్టుడుతోటి మాకు రందివోయింది. సాలుకు రెండు సార్లు పెట్టుబడికి ఇచ్చి ఎంతో ఆసరా అయితాండు. ఎరువుల బస్తాలు కూడా మస్తుగ దొరుకుతానయ్. ఇదివరకు లెక్క ఎరువుల కోసం పని ఇడిశిపెట్టి పట్నం పోయి లైన్లు కట్టే బాధ కూడా తప్పింది. కాల్వల నిండా గోదావరి నీళ్లు ఫుల్లు పారుతానయ్. మొన్ననే యాసంగి బాపతి రైతుబంధు పైసలు రూ.30వేలు బ్యాంకుల పడ్డయ్. ఆ పైసలతోటి ఎరువులు, విత్తనాలు కొంట. కేసీఆర్ రైతుబంధు ఇయ్యవట్టే మా అమ్మనాయన గోస తీరింది. రైతుల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి ఉంటే రైతులకు ఎంతో మేలైతది. రంది లేకుంట ఎవుసం చేసుకోవచ్చు. బంగారు పంటలు పండియ్యచు. ఒక రైతుకు ఇంతకన్న ఏం గావాలె.
మల్చింగ్ షీట్లు వేయించిన..
నర్సింహులపేట, జనవరి 1 : నాకు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇదివరకు బావిలో నీరు లేక ఒక పంట మాత్రమే పండింది. ప్రతి ఏడాది రూ.40వేలు రైతుబంధు కింద వస్తున్నయ్. నేను మూడెకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నా. పంట పెట్టుబడికి వచ్చే డబ్బులు రూ.8వేలతో మల్చింగ్ షీట్లు వేయించిన. అలాగే రూ.2వేలు పెట్టి ఫర్టిలైజర్ ట్యాంకులో దుక్కిమందు, యూరియా కలిపి కూరగాయలకు అందిస్తున్నా. కూరగాయల సాగుతో ఎకరానికి అన్ని ఖర్చులు పోను ఒక పంటకు రూ.లక్షా 20వేల దాకా మిగులుతున్నయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రైతుబంధు పథకం కింద ఇచ్చే పెట్టుబడి డబ్బులు నాకు ఎంతో ఆసరా అవుతున్నయ్. ఇప్పుడు దర్జాగా కూరగాయలు పండిస్తున్నా. మునుపటి లెక్క కష్టాలు తప్పినయ్. రైతు చనిపోతే రూ.5లక్షల బీమా ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇస్తున్నడు. కేసీఆర్ వచ్చిన తర్వాత రైతుబంధు మొదలైన కాన్నుంచి వ్యవసాయం బాగుపడ్డది. రంది లేకుంట కడుపునిండా తిని కంటినిండా నిద్రపోతున్నాం. రెండు సీజన్లలో టైమ్‌కు రైతుబంధు రావడం వల్ల నిశ్చింతగా ఉంటున్న.
రైతుబంధుతో ఎంతో మేలైంది..
వాజేడు , జనవరి 1 : ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా గిట్ల రైతులను ఆదుకోలే. పంటలు పండించడానికి అదునుకు పెట్టుబడి సాయం ఇచ్చిన రైతుల్లో ధైర్యం నింపుతాండు సీఎం కేసీఆర్ సార్. వానకాలం, యాసంగిల నాకు రూ.40వేల వస్తున్నయ్. మొన్ననే బ్యాంకు ఖాతల పడ్డయ్. ప్రతి యేడు డబ్బులు పడంగనే విత్తనాలు, ఎరువులు మందుగానే తీసుకుంటున్నా. అంతకుముందు అప్పు తెచ్చి పంటలు వేసేది. ఇప్పుడ ఆ బాధ తప్పింది. కూలీలకు ఇయ్యడానికి అక్కెరకు వత్తానయ్. ఇదివరకు ఎవుసం పనులు లెక్క మస్తు కష్టమనిపించేది. ఇప్పుడు పెట్టుబడికి పైసల్ ఇయ్యడం వల్ల చాలా మేలైతాంది. కరెంట్, నీళ్లు మస్తు ఉంటానయ్. ఇగ బేఫికర్.