వెంకటాపూర్/కాళేశ్వరం, జనవరి 1 : నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శనివారం సెలవు రోజు కావడంతో ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు, పర్యాటకులు భారీగా తరలిరాగా కిక్కిరిసింది. దాదాపు 20వేల మంది సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజరులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్ పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయచరిత్ర, విశిష్టతను టూరిజం గైడ్స్ వివరించగా ఆసక్తిగా తెలుసుకున్నారు. అనంతరం రామప్ప సరస్సుకు చేరుకొని బోటింగ్ చేసి ఆహ్లాదంగా గడిపారు.
కాళేశ్వర ఆలయంలో…
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో శనివారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకోగా సందడి నెలకొంది. తొలుత గోదావరి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి గోదావరి మాతకు దీపాలు వదిలారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకొన్నారు. ఆలయంలో ఉన్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్వతీ అమ్మవారిని, మహాసరస్వతి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
కలెక్టర్ దంపతుల పూజలు
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి కలెక్టర్ భవేశ్‌మిశ్రా, ములుగు అడిషనల్ కలెక్టర్ హీలీ పాటిల్ దంపతులు శనివా రం ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గణపతి వద్ద పూజలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. పార్వతీ అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన తర్వాత అర్చకులు స్వామి వారి శేషవస్ర్తాలతో సన్మానించారు. శ్రీనివాస్ ఉన్నారు.