జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 8 (నమస్తేతెలంగాణ) : కాటన్ జిన్నింగ్ మిల్లులకు సీసీఐ బకాయి ఉన్న ఇన్సెంటివ్స్ తక్షణమే చెల్లించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన శాసనసభలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువగా పత్తి పండిస్తారని, ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు సరిగాలేక ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. సీసీఐ నుంచి బకాయిలు రాక జిన్నింగ్ మిల్లుల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసినప్పుడు ఇండస్ట్రీపై ఎటువంటి భారం పడలేదన్నారు. కానీ, ఈ సారి జిన్నింగ్ మిల్స్ వారే ట్రేడింగ్ చేయాల్సి ఉన్నందున వారిపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జిన్నింగ్ మిల్లులకు పవర్ టారిఫ్‌లో ఎస్టీ లైన్ ఎవరికైతే ఉందో వారు అదనంగా పవర్ వాడడం వల్ల ఒక్కో మిల్లుపై సుమారు రూ.20 నుంచి రూ.30 లక్షల పెనాల్టీ వేసినట్లు తెలిపారు. అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలోని చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి అటవీశాఖ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని వారికి కేటాయించినట్లు చెప్పారు. కొంత పని జరిగిన తర్వాత కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లగా, కోర్టు సైతం కాంప్రమైజ్ చేసి వ్యాపారులకు బాసటగా నిలిచినట్లు తెలిపారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు చెప్పినప్పటికీ అటవీశాఖ అధికారులు సహకరించడంలేదన్నారు. ఆ భూమి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉందంటూ మొండికేస్తున్నట్లు తెలిపారు. దీనిని పరిష్కరిస్తే 50 మంది చిరు వ్యాపారులకు మేలు జరుగుతుందని సభలో ఎమ్మెల్యే గండ్ర వివరించారు. ఇందుకు స్పందించి సంబంధిత మంత్రి సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
రెండో రోజు కలశ పూజ
దేవీ నవరాత్రుల్లో భాగంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న నవాహ్నిక చండీ యాగ క్రతువులో రెండో రోజు అమ్మ వారికి కలశ విశ్వక్షోన (గణపతి) ఆరాధన, చండీయాగం, కుంకుమ పూజ, సుహాసిని పూజలను వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి నిర్వహించారు. మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాల గోష్టి నిర్వహించారు.