కాళేశ్వరం, ఆగస్టు 8 : పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో ప్రమాదవశాత్తు మునిగి ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. ఎస్సై ప్రసన్నకుమార్ తెలిపిన వివరాల ప్రకా రం… వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండంలోని సింగారం గ్రామానికి చెందిన జక్కుల వీరస్వామి(45) కుటుంబసభ్యులతో కలిసి గోదావరిలో తమ బంధువు అస్థికల నిమజ్జానికి వచ్చాడు. అస్థికలు నిమజ్జనం చేస్తుండగా నదిలో మునిగి ఆరుగురు గల్లంతయ్యారు. కాగా, అక్కడే ఉన్న యాత్రికులు ఐదుగురిని సురక్షితంగా బయటికి తీసుకురాగా వీరస్వామి ఆచూకీ లభించలేదు. గజ ఈతగాళ్ల సహాయంతో వీరస్వామి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం మహదేవపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరస్వామికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
విద్యుత్ షాక్‌తో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్..
మహాముత్తారం : విద్యుత్ షాక్‌తో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. క్యాంపు వద్ద హర్యానా రాష్ర్ర్టానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పవన్‌సింగ్ (38) మహాముత్తారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం బ్యాడ్మింటన్ కోర్టు వద్ద బల్బు అమర్చుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన తోటి సీఆర్పీఎఫ్ సిబ్బంది భూపాలపల్లిలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి పవన్‌సింగ్ మృతిచెందనట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. బీ/58 బీఎన్ సీఆర్పీఎఫ్ కమాండింగ్ ఆఫీసర్ టీఎల్ లీనిష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు..
తాడ్వాయి : మండలంలోని ఊరట్టం పంచాయతీ పరిధిలోని బాసగూడేనికి చెందిన మడప చెన్నయ్య(25) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నయ్య శనివారం ఉదయం పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఆరోగ్యం సరిగా లేదని చెప్పాడు. ఉదయం ఎంతలేపినా లేవకపోవడంతో 108కి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరీక్షించి చెన్నయ్య పాముకాటుతో మృతిచెందాడని చెప్పినట్లు ఆమె తెలిపారు. మృతుడికి ఒక కూతురు, కుమార్తె ఉన్నారు.