భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 8 : రైతు వేదికలు అన్నదాతలకు చేరువయ్యాయి. రైతులకు ఒక బడిలా మారాయి. వ్యవసాయ అధికారులు రైతు వేదికల వద్దకు వెళ్లి కర్షకులతో సమావేశమవుతున్నారు. ప్రస్తుతం వేసిన పంటలపై, వేయబోయే పంటలపై సలహాలు ఇస్తూ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికల లక్ష్యం నెరవేరుతోంది. సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నం ఫలిస్తుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం అన్నదాతలకు ఎవుసంపై సమస్యలను నివృత్తి చేస్తూ, ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందించేందుకు ఒక వేదిక ఉండాలని భావించి గ్రామాల్లో రైతు వేదికలను ఏర్పాటు చేసిం ది. దీంతో వ్యవసాయ అధికారులు రైతుకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు, సాగు విధానాలపై శిక్షణ, అవగాహన కల్పిస్తున్నారు. ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా, క్లస్టర్‌కో వేదిక చొప్పున 45 క్లస్టర్లలో 45 సమావేశ మందిరాలను నిర్మించారు. ఒక్కో వేదికను రూ.12.5 లక్షలతో నిర్మించి పూర్తి చేశారు. జిల్లాలోని బోర్లగూడెం, తాడిచెర్లలో అసంపూర్తిగా ఉన్నాయి. అవసరం మేరకు మండల వ్యవసాయ విస్తరణ అధికారులను ప్రభుత్వం నియమించింది. రైతులకు వారి సేవలు అందేలా చేసింది. సుమారు ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున రైతు వేదిక భవనాలను నిర్మించి అందుబాటులోకి తెచ్చింది.
స్టడీ సెంటర్
గ్రామాల్లో రైతు వేదిక భవనం రైతులకు ఒక స్టడీ సెంటర్‌గా మారింది. గతంలో వ్యవసాయ అధికారులు తూతూ మంత్రంగా గ్రామాలకు వెళ్లి ఏదో ఒకచోట రైతులతో మాట్లాడి వచ్చేవారు. రైతులు, వ్యవసాయ అధికారులు కూర్చుని మాట్లాడుకునేందుకు ఒక వేదిక ఉండాలని భావించిన సీఎం కేసీఆర్ రైతువేదిక భవనాలను నిర్మించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ సిబ్బందితో రోజుకో గ్రామానికి వెళ్లి రైతు వేదికల్లో రైతులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వానకాలంలో రైతులు వేసిన పంటలను వివరిస్తూ, యాసంగిలో ఏ పంటలు వేస్తే బాగుంటుందనే విషయాన్ని, ప్రభుత్వ పాలసీని వివరిస్తున్నారు. ముఖ్యంగా యాసంగిలో రైతులు బావులు, బోర్ల కింద వరి కాకుండా ఆరుతడి పంటలు వేయాలని వివరిస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు వ్యవసాయశాఖ మరింత చేరువవుతుంది. రైతు వేదికల్లో ఏఈఓలకు ప్రత్యేక గదిని కేటాయించారు. ఒక్కో వేదిక పరిధిలో మూడు నుంచి నాలుగు గ్రామాలకు పైగా ఉండడంతో వేదిక వద్దకు వెళ్లేందుకు అనువైన ప్రదేశాల్లో నిర్మాణాలు చేశారు.
మంచి వేదిక..
ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో రైతు వేదిక భవనాలు నిర్మించింది. ఈ భవనాలకు ఎవరు వస్తారు? వ్యవసాయ అధికారులు వచ్చి సమావేశాలు పెట్టడం డౌటే? ఇలా అనేక అనుమానాలు చాలా మంది నుంచి వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ జిల్లాలోని అన్ని రైతు వేదిక భవనాల్లో చక్కటి సమావేశాలు జరుగుతున్నాయి. తాను ప్రతి వేదికలో సమావేశాలు నిర్వహిస్తున్న. ఏవో, ఏఈవోలు సైతం రైతు వేదికల్లో అన్నదాతలతో సమావేశాలు నిర్వహిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. రైతులు సైతం వేదికల వద్దకు వచ్చి తాము చెప్పే విషయాలు ఆసక్తిగా వింటున్నారు. ముఖ్యంగా యాసంగి పంట విషయంలో రైతులకు ప్రత్యేకంగా సలహాలు ఇస్తున్నాం.
-విజయభాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి