భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 8: అన్నారం (సరస్వతి) బరాజ్ పరిసర ప్రాంతాల్లో గోదావరి వరదతో ముంపునకు గురవుతున్న పంట భూముల వివరాలను రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, సర్వేల్యాండ్ శాఖల సంయుక్త సర్వే ద్వారా పరిశీలించి సరైన నిర్ణయం కోసం ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, అన్నారం బరాజ్ పరిసర గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. గోదావరి వరదలతో ముంపునకు గురవుతున్న పంట భూములు, పంట నష్టంపై చర్చించారు. ఈ సందర్భంగా అన్నారం, చండ్రువెల్లి, దామరకుంట, లక్ష్మీపూర్, గండ్రత్పల్లి, మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల గ్రామాల రైతులు మాట్లాడారు. బరాజ్ నిర్మించిన తర్వాత మూడేళ్లుగా గోదావరి వరదలకు అధిక విస్తీర్ణంలో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించి భూములు ముంపునకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి వరదలతో పంటలు ముంపునకు గురవడం బాధాకరమన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, సర్వేల్యాండ్ శాఖల ద్వారా సంయుక్తంగా గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్నారం బరాజ్ కట్టకముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రికార్డులు, కట్టిన తర్వాత భూముల ముంపు వివరాలను గ్రామాలు, రైతులు, భూమి విస్తీర్ణం, సర్వే నెంబర్, పంటల వారీగా సేకరించి ప్రభుత్వానికి పూర్తి నివేదికలను అందించి రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు చేపడతామని అన్నారు.
శాటిలైట్ పరిజ్ఞానంతో ప్రాజెక్ట్ నిర్మాణం
శాటిలైట్ పరిజ్ఞానం ఆధారంగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేట్టారని ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ నల్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు కట్టక ముందు కూడా గోదావరి తీరప్రాంత పంట పొలాలు ముంపునకు గురయ్యాయన్నారు. కానీ, ఈ సారి గోదావరి పరివాహక ప్రాంతంలో అధికంగా వర్షాలు కురిసి ఎల్లంపల్లి, ఎల్ఎండీ ప్రాజెక్టుల నుంచి అధిక నీరు రావడం వల్ల వరదలకు పంట నష్టం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే చేసి రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాళేశ్వరం దేశానికే ఆదర్శం
దేశానికి ఆదర్శంగా ఉండేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ ఓఎస్డీ మనోహర్ తెలిపారు. గోదావరి ముంపు వాటర్‌తో జరిగే నష్టంపై ప్రభుత్వ స్థాయిలో చర్చించినట్లు చెప్పారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, ఆర్డీవో శ్రీనివాస్, ఇరిగేషన్ ఎస్ఈ రమణారెడ్డి, అన్నారం బరాజ్ ఈఈ యాదగిరి, మహదేవపూర్ మండల ప్రత్యేక అధికారి శోభారాణి, కాటారం డీఎస్పీ బోనాల కిషన్, కలెక్టర్ కార్యాలయ ఏవో మహేశ్‌బాబు, ఇరిగేషన్ డీఈలు పాల్గొన్నారు.