బచ్చన్నపేట, ఏప్రిల్ 12 : తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ తన భర్త ఇంటి ముందు బైఠాయించింది. గత నాలుగేళ్లుగా తనను అత్తగారింటికి తీసుకెళ్లడం లేదని.. న్యాయం జరిగేంత వరకూ ఇక్కడే ఉంటానని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని భర్త ఇంటి ముందు బాధితురాలు భీష్మించుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజపేట మండలం జాల గ్రామానికి చెందిన కాకల్ల కనకయ్య, వెంకటమ్మల కుమార్తె సౌమ్యకు నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కన్నె యాదయ్య, మల్లమ్మల రెండో కుమారుడు శివతో 2021లో ఘనంగా వివాహం జరిగింది.
పెళ్లి సమయంలో పెద్దల సమక్షంలో రూ. 2.50 లక్షల నగదు, ఆరు తులాల బంగారం కట్నకానుకలుగా అందజేశారు. వివాహం జరిగిన మొదటి ఏడాది వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే.. గత నాలుగు సంవత్సరాలుగా భర్త శివ తనను ఇంటికి తీసుకువెళ్లకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సౌమ్య ఆవేదన వ్యక్తం చేసింది. భర్త, బావ వైఖరితో విసిగిపోయిన ఆమె చివరకు న్యాయం కోసం భర్త ఇంటి ముందే మౌన పోరాటానికి దిగింది.
”నాకు న్యాయం జరిగే వరకు ఈ ఇంటి ముందు నుండి కదిలేది లేదు” అని సౌమ్య స్పష్టం చేసింది. ఈ విషయమై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని, తన భర్తతో కలిసి జీవించేలా చూడాలని ఆమె ప్రాధేయపడుతోంది. బాధితురాలికి జాల గ్రామస్తులు, నాగిరెడ్డిపల్లి ప్రజలు భారీ సంఖ్యలో మద్దతు తెలిపారు.