తరిగొప్పుల, మార్చి 17: కాంగ్రెస్ పాలనలో మంచినీళ్ల కోసం(Drinking water) ఆడబిడ్డలు అరిగోస పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం మైళ్లదూరం పయణించాల్సిన దుస్థితి నెలకొంది. పదేండ్ల తర్వాత ఖాళీ బిందెలతో రోడ్లపై ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మండలంలోని అంకుషాపుర్ గ్రామపంచాయతీ పరిధి బంజరుపల్లి కాలనీలో గత 15 రోజుల నుంచి మంచినీళ్లు రాకపోవడంతో నిరసనగా సోమవారం కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మంచినీళ్లు రావడంలేదని స్థానిక పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు దొరకడం లేదన్నారు. మార్పు అంటే ఇదేనా అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రెండు రోజుల్లో మంచినీరు సౌకర్యం కల్పించకపోతే పెద్ద ఎత్తున మహిళలందరూ గ్రామపంచాయతీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముక్కెర కరుణ, పోతరాబోయిన రమ్య, కుమ్మరి ముణెమ్మ, అర్రే అంజవ్వ, కుంట కేతమ్మ, కుసుంబ నిర్మల, పోతరబోయిన కలమ్మ , కుసుంబ రాధ, ముక్కెర శ్యామల, కుసుంబ సూజత, పందిళ్ల నిర్మల, బేగ్జం సౌమ్య, ముక్కెర కనకమ్మ తదితరులు పాల్గొన్నారు.