వరంగల్, మార్చి 2(నమస్తేతెలంగాణ) : స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)ల్లో సభ్యులైన మహిళలకు రుణాలు ఇస్తున్నది. ఈ రుణం పొందిన మహిళల్లో నిర్దేశిత వాయిదాల ప్రకారం తిరిగి చెల్లిస్తే వడ్డీ లేని రుణ పథకాన్ని వర్తింపజేస్తున్నది. దీన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. స్త్రీనిధి రుణాలతో జీవనోపాధి పొందుతున్నారు. ఫలితంగా స్త్రీనిధి పేద మహిళల పెన్నిధిగా మారింది. సభ్యుల సం ఖ్య ఆధారంగా ఎస్‌హెచ్‌జీ గరిష్ఠ రుణ నిలువ పరిమితులను ప్రభుత్వం నిర్ణయించింది. పది మంది అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటే గరిష్ఠంగా రూ.6 లక్షలు, 8 నుంచి 9 మంది సభ్యులు ఉంటే రూ.4 లక్ష లు, 5 నుంచి 7 మంది సభ్యులు ఉంటే రూ.3 లక్షల రుణం ఇస్తున్నది. ఎస్‌హెచ్‌జీల్లోని సభ్యులు సువిధ నుంచి రూ.40 వేల వరకు రుణం తీసుకుంటే 24, ప్రగతి నుంచి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు రుణం పొందితే 42, రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు రుణం తీసుకుంటే 48, అక్షయ నుంచి రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం పొందితే 60, సౌభా గ్య నుంచి రూ.1.25 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రుణం తీసుకుంటే 60 నెలల్లో నిర్దేశిత వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రూ.లక్షలోపు రు ణం పొందిన ఎస్‌హెచ్‌జీల్లోని సభ్యులకు మాత్రమే వడ్డీలేని రుణ పథకం వర్తించనుంది. అదికూడా వాయిదాల పద్ధతిలో బకాయి లేకుండా రుణం తిరిగి చెల్లించిన సభ్యులకు ప్రభుత్వం వడ్డీ డబ్బును నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది.
లక్ష్యానికి మించి పంపిణీ..
స్త్రీనిధి నుంచి జిల్లాలోని పదకొండు మండలాల్లో 2020-21 ఆర్థిక సంవత్సరం 5,219 ఎస్‌హెచ్‌జీల్లోని 13,924 మంది సభ్యులకు రూ.86.18 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యం నిర్దేశించగా 82.83 శాతం అంటే రూ.72.23 కోట్ల రుణ పంపిణీ మాత్రమే జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరం 12,230 ఎస్‌హెచ్‌జీల్లోని సభ్యులకు రూ.76.40 కోట్ల రుణాలను పంపిణీ చేయలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. బుధవారం వరకు 10,857 మంది సభ్యులకు రూ.77.88 కోట్ల రుణాల పంపిణీ జరిగినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం సంపత్‌రావు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం గడువు నెలాఖరు వరకు ఉండగా ఇప్పటికే మహిళలకు లక్ష్యానికి మించి 101.93 శాతం స్త్రీనిధి రుణాల పంపిణీ జరిగింది. రు ణం పొందిన మహిళలు ఇంటి అవసరాలు, చిరు వ్యా పారాలకు వినియోగించుకుంటున్నారు. అనేక మంది కోడి పిల్లల పెంపకం కేంద్రాలు, పెరటి కోళ్ల పెంపకం, జనరిక్ మెడికల్ షాపులు, చిన్న మార్ట్స్, దుకాణాలు, వీధి వ్యాపారాల నిర్వహణతో స్వయం ఉపాధి పొందుతున్నారు. కొందరు ఎలక్ట్రిక్ ఆటో, ట్రాలీలు, ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేశారు. రుణాల రికవరీ 86.48 శాతంగా ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బకాయిలు 4.35 శాతం ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు.
అగ్రభాగాన ఖానాపురం..
స్త్రీనిధి రుణాల పంపిణీలో జిల్లాలో ఖానాపురం మండలం అగ్రభాగాన నిలిచింది. మండలం వారీగా ఈ ఆర్థిక సంవత్సరం స్త్రీనిధి రుణాల పంపిణీ పరిశీలిస్తే జిల్లాలో ఖానాపురం 143.50శాతంతో ప్రథమ స్థానం లో నిలిచింది. 139.05శాతంతో చెన్నారావుపేట ద్వితీ య, 126.78శాతంతో గీసుగొండ తృతీయ స్థానంలో ఉన్నది. ఖానాపురంలో రుణ పంపిణీ నిర్దేశిత లక్ష్యం రూ.6.18 కోట్లు కాగా, ఇక్కడ రూ.8.87 కోట్ల పంపిణీ జరిగింది. చెన్నారావుపేటలో రూ.5.93 కోట్లకు రూ.8.25కోట్లు, గీసుగొండలో రూ.6.21 కోట్లకు రూ.7.87 కోట్ల రుణ పంపిణీ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సంగెంలో 119.74శాతం, నెక్కొండలో 119.22శాతం, నర్సంపేటలో 107.76 శాతం రుణ పంపిణీ జరిగితే ఇతర మండలాల్లో వంద శాతంలోపు జరిగింది. రాయపర్తిలో అతి తక్కువగా 56.56 శాతం రుణాల పంపిణీ జరిగినట్లు రికార్డుల ద్వారా తెలుస్తున్నది. నల్లబెల్లిలో 65.45శాతం, వర్ధన్నపేటలో 69.36శాతం, పర్వతగిరిలో 84.41శాతం, దుగ్గొండిలో 96.49 శాతం రుణ పంపిణీ చేశారు. గడువు ఉన్నందున తక్కువ శాతం రుణ పంపిణీ జరిగిన మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.