
ఖిలావరంగల్, సెప్టెంబర్ 1 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు బుధవారం తెరుచుకున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో చాలా చోట్ల విద్యార్థులు ఉత్సాహంగా తరలివెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పాఠశాలలో కొవిడ్-19 నిబంధనలను పక్కాగా అమలు చేశారు. థర్మల్ స్క్రీన్‌తో జ్వర పరీక్ష అనంతరం పాఠశాలలోకి విద్యార్థులను అనుమతినిచ్చారు. తరగతి గదుల్లో కూడా బెంచీకి ఒక్కరు చొప్పున కూర్చోబెట్టారు. శివనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ద్వారం ముందు కొవిడ్ నిబంధనలకు సంబంధించిన వాల్ పోస్టర్ అంటించారు. మామిడి తోరణాలను కట్టి ఉపాధ్యాయులు విద్యార్థులను ఆహ్వానించారు. 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, ఎస్ఎంసీ చైర్మన్ కాసం రాజు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. చింతల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 296 మంది విద్యార్థులకు గాను తొలి రోజు 42 మంది హాజరయినట్లు హెచ్ఎం శ్రీధర్ తెలిపారు. కాగా, వరంగల్ డీఈవో వాసంతి కోటలోని ఆరెళ్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, శివనగర్ ప్రాథమిక పాఠశాలతోపాటు పలు డివిజన్లలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు.
కరీమాబాద్ : అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, సిద్ధం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన, ఈదురు అరుణ ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. పలు చోట్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతాలు పలికారు. బడుల్లో అందమైన ముగ్గులు వేశా రు. శంభునిపేటలో కార్పొరేటర్ పోశాల పద్మ మధ్యాహ్న భోజనం చేశారు.
కాశీబుగ్గ : సుందరయ్యనగర్ జడ్పీ పాఠశాలలో ఉపాధ్యా యులు విద్యార్థులకు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. కాశీబుగ్గ, లేబర్‌కాలనీ, ప్రతాపనగర్ పాఠశాలను కొవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించారు.
పోచమ్మమైదాన్ : వరంగల్ 21వ డివిజన్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్‌బౌళి ఉన్నత పాఠశాలను మామిడి తోరణాలు, అరటి ఆకులతో అలంకరించారు. కార్పొరేటర్ ఎండీ ఫుర్కాన్ పాఠశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ ఎండీ అఫ్జల్, వైస్ చైర్పర్సన్ తేజస్విని, హెచ్ఎం సరస్వతీదేవి పాల్గొన్నారు.
మట్టెవాడ : నగరంలోని మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు. విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ ఆకుతోట రామ తేజస్విని మాస్కులను పంపిణీ చేశారు. విద్యార్థులు ఎంతో సంబురంగా పాఠశాలకు రావడం, ఉపాధ్యాయులను నమస్కారం చేయడం కనబడింది. కార్యక్రమంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్మసూద్, 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి పాల్గొన్నారు.
వర్ధన్నపేట : మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ అన్నారు. వర్ధన్నపేట పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను మున్సిపల్ వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్‌రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్, కౌన్సిలర్లతో కలిసి పునఃప్రారంభించారు. కోనాపురంలో కౌన్సిలర్ పాలకుర్తి సుజాత అంగన్వాడీ కేంద్రాన్ని పునఃప్రారంభం చేసి విద్యార్థులకు భోజనం వడ్డించారు. కౌన్సిలర్లు తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట : నర్సంపేటలోని రామాలయం వీధి పాఠశాలను మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని ప్రారంభించారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పూలు అందించి స్వాగతం పలికారు. ప్రత్యక్ష బోధనలు ప్రారంభం కావడంతో పిల్లలకు పుస్తకాలు అందించారు. అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించారు.
నర్సంపేట రూరల్ : మొదటి రోజు విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు చేరుకున్నారు. విద్యార్థులకు శానిటైజర్లు అం దించారు. మాస్క్ ధరించేలా చర్యలు తీసుకున్నారు.
చెన్నారావుపేట : మండలంలోని అమృతండాలోని ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు బానోతు వెంకన్న, ఉపాధ్యాయుడు నీలం రమేశ్ పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు గులాబీ పూలు అందించి స్వాగతం పలికారు. ఉప్పరపల్లిలో హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులను సాదరంగా ఆహ్వానించారు. కాగా, మండల కేంద్రంలోని కొసవాడ అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు కంది కృష్ణచైతన్యరెడ్డి మాస్కులు అందించారు. సీడీపీవో రాధిక, ఏసీడీపీవో విద్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ మంజుల పాల్గొన్నారు.
ఖానాపురం : మండలంలోని పాఠశాలలను ఇన్చార్జి ఎంఈవో రత్నమాల పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెన్ను శృతి తదితరులు పాల్గొన్నారు.
దుగ్గొండి : మండలంలోని నాచినపల్లి హైస్కూల్‌ను సర్పం చ్ పెండ్యాల మమత తనిఖీ చేశారు. కొవిడ్ నిబంధనలు పా టించాలని సూచించారు. హెచ్ఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
నల్లబెల్లి : విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీపీ ఊడుగుల సునీత అన్నారు. లెంకపల్లి అంగన్వాడీ సెంటర్‌ను పరిశీలించారు. మండలంలోని ఎంపీపీఎస్ పాఠశాలలు 30, టీడబ్ల్యూపీఎస్ 2, ఎంపీయూపీఎస్ 6, జడ్పీస్ఎస్ 8, ఏహెచ్ఎస్ 1, కేజీబీవీ 1, మొత్తం 48 పాఠశాలల్లో 4483 మంది విద్యార్థులు ప్రవేశం తీసుకోగా మొ దటి రోజు 898 మంది హాజరైనట్లు ఎంఈవో చదువుల సత్యనారాయణ తెలిపారు.
రాయపర్తి : మండల కేంద్రంతో పాటు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామి, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ అయిత రాంచందర్ పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పిన్సిపాల్ జయకుమారి నేతృత్వంలో అధ్యాపకులు ప్రభాకర్, నవీన్‌కుమార్, రాజిరెడ్డి, సిబ్బంది విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. కొత్త రాయపర్తిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ నర్సయ్య ప్రారంభించారు.
రాయపర్తి(సంగెం) : సంగెం మండలంలోని మొండ్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సర్పంచ్ గూడ కుమారస్వా మి సందర్శించారు. 250 మంది విద్యార్థులు, పాఠశాల ఉ పాధ్యాయులు, సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ బాటిళ్లను అందజేశారు. హెచ్ఎం లక్ష్మణ్, వార్డు సభ్యుడు దుడ్డె ప్ర శాంత్గౌడ్, పంచాయతీ కార్యదర్శి జనార్దన్ పాల్గొన్నారు.
గీసుగొండ : కరోనా నిబంధనలు పాటిస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ఎంపీపీ భీమగాని సౌజన్య, ఎంపీడీవో రమేశ్ సూచించారు. మండలంలోని పలు పాఠశాలలను వారు తనిఖీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు జైపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, బాలిరెడ్డి, బాబు, వీరాటి కవిత, నాగేశ్వర్రావు, స్రవంతి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల సంఖ్య పెంపునకు చర్యలు : డీఈవో వాసంతి
ఖిలావరంగల్ : విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి తెలిపారు. జిల్లాలో 34.78 శాతం మంది విద్యార్థులకు స్కూళ్లకు హాజరయినట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. చెన్నారావుపేట మండలంలో 34.29 శాతం, దుగ్గొండిలో 33.75 శాతం, గీసుగొండలో 34.59 శాతం, ఖానాపురంలో 33.78 శాతం, ఖిలావరంగల్‌లో 35 శాతం, నల్లబెల్లిలో 34.5 శాతం, నర్సంపేటలో 34.87 శాతం, నెక్కొండలో 34.5 శాతం, పర్వతగిరిలో 34.5 శాతం, రాయపర్తిలో 33.8 శాతం, సంగెంలో 34.4 శాతం, వరంగల్‌లో 35.18 శాతం, వర్ధన్నపేటలో 34.66 శాతం విద్యార్థులు తొలి రోజు పాఠశాలలకు హాజరయ్యారు. మొత్తం 96,392 మంది విద్యార్థులకు 33,524 మంది హాజరయ్యారు.
విద్యార్థులను భద్రంగా చూసుకోవాలి..
అడిషనల్ కలెక్టర్ హరిసింగ్
వర్ధన్నపేట : పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భద్రంగా చూసుకోవాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. మండలంలోని ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిందన్నారు. ఉపాధ్యాయులు విధిగా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలన్నారు. క్యాక్రమంలో తహసీల్దార్ గుండెల నాగరాజు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీధర్, రాజు, వీరస్వామి, లలిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.