
నల్లబెల్లి, ఆగస్టు 25: పేదింటి ఆడబిడ్డను చేరదీసి అన్నీతానై వివాహం జరిపించి దాతృత్వం చాటుకున్నారు జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్నాసుదర్శన్రెడ్డి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గుండ్లపహాడ్కు చెందిన అల్లె సుందరి పుట్టుకతోనే దివ్యాంగురాలు. అలాగే, బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ది స్వప్న గుండ్లపహాడ్ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఈ బాలిక తారసపడింది. ఈ సందర్భంగా సుందరి దీనస్థితిని తెలుసుకుని చలించిన స్వప్న తక్షణ సాయం అందించారు. అప్పటి నుంచి ఆమె బాగోగులు చూసుకుంటూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలికకు పెళ్లీడు రావడంతో నర్సంపేట మండలం మాదన్నపేట రోడ్డు పక్కన చిన్న కిరాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దివ్యాంగుడు దండు వెంకన్నకు సుందరినిచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పించారు. తన దత్తపుత్రిక సుందరి వివాహాన్ని సంప్రదాయ బద్ధంగా కట్నకానుకలు, చీరెసారె, మట్టెలు, మంగళసూత్రాలను పెద్ది స్వప్న స్వయంగా సమర్పించి బుధవారం దగ్గరుండి వివాహం జరిపించారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి మున్ముందు ఈ దంపతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వివాహ వేడుకలో టీఆర్ఎస్ నాయకులు వర్ణం నర్సింహారెడ్డి, చింత కొంరెల్లి, బైరుపాక సుధాకర్, కొండోజు వెంకన్న, శ్రీధర్, మైనోద్దీన్, కొలువుల సాంబయ్య, గోనెల సాంబయ్య, మర్రి కొమారి, మేడిద శ్రీనివాస్ పాల్గొన్నారు.