వరంగల్చౌరస్తా, మార్చి 22: వరంగల్ ఎంజీఎం దవాఖానలో కొందరు అధికారులు, ఉద్యోగులు యూనియన్ల పేరు చెప్పి విధులకు డుమ్మా కొడుతూ నెలనెలా జీతాలు పొందుతున్నారు. విధులు నిర్వర్తించాల్సిన సమయంలో యూనియన్ పనులు ఉన్నాయంటూ విధులకు హాజరు కాకుండా ఆఫీసు పనులను మూలనపడేస్తున్నారు. దీంతో కార్యాలయంలో పనులు చాలా వరకు పెండింగ్లో ఉంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడతామంటూ కులాలు, విభాగాలు, విధుల వారీగా యూనియన్లు, సంఘాలు ఏర్పాటు చేసుకొని తాము యూనియన్లు, సంఘాలకు నాయకులమంటూ విధులకు డుమ్మా కొడుతున్నారు. కొందరు ఉద్యోగులు వారంలో సగం రోజులు కూడా విధులు రావడం లేదంటే అతిశయోక్తికాదు. దీంతో ఎంజీఎం కార్యాలయంలో అభివృద్ధి, నివేదికలు, ఉన్నతాధికారులకు అందించాల్సిన సమాచారం పెండింగ్ ఫైల్స్ గుట్టలుగా పేరుకుపోతున్నాయి.
యూనియన్ నాయకులకు సంబంధించిన పనులను ఇతర సిబ్బందికి పురమాయించడంతో అవకతవకలు జరుగుతున్నాయని, యూనియన్లకు దూరంగా ఉండే ఉద్యోగులకు పనిభారం పెరుగుతున్నదని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంజీఎం కార్యాలయంలోని చాలా విభాగాల్లో ఇదే తీరు కనిపిస్తున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విధులకు హాజరు కాని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్తులైన ఫర్నిచర్, బీరువాలపై యూనియన్ పోస్లర్లు అంటించకుండా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, ప్రజలు కోరుతున్నారు.