అమరావతి : అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్రామంలో ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య (Accused suicide) చేసుకున్నాడు. కనసానివారిపల్లె చెరువులో బుధవారం శవమై తేలడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గత సోమవారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్ద బాలిక ఆడుకుంటుం డగా ఎదురింట్లో ఉండే కులవర్ధన్ ( Kulavardan ) ఆమెను ఇంటికి పిలిచాడు. ఆ తరువాత నుంచి బాలిక కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బాలిక ఆచూకీ కోసం అనేక చోట్ల గాలింపు జరిపి చివరకు అనుమానంతో నిందితుడి ఇంట్లో తనిఖీలు చేయగా వాటర్ డ్రమ్ములో బాలిక శవమై కనిపించింది.అక్కడే ఉన్న నిందితుడిని పట్టుకుని తీసుకెళ్తుండగా స్థానికులు నిందితుడి పట్టుకుని విపరీతంగా చితకబాదారు. పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలిస్తుండగా మంగళవారం ఉదయం పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడని అతని కోసం రెండు పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని అన్నమయ్య జిల్లా ఎస్పీ తెలిపారు.
బుధవారం ఉదయం చెరువులో శవమై కనిపించాడని వివరించారు. గతంలో నిందితుడిపై కేసులు ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.