ప్రైవేట్ ధాటికి గోపతండా, పిచ్చిరాంతండా పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల సంఖ్య
పట్టుబట్టి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించిన ఉపాధ్యాయులు
చుట్టుపక్కల తండాల్లో విస్తృత ప్రచారం
గణనీయంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య
దాతల సహకారంతో ప్రొజెక్టర్లు, వాల్ పెయింటింగ్స్
నర్సింహులపేట, మార్చి 21;ఆంగ్లమాధ్యమం నర్సింహులపేట మండలం గోపతండా, పిచ్చిరాంతండాల్లోని ప్రాథమిక పాఠశాలలను నిలబెట్టింది. విచ్చలవిడిగా వెలిసిన ప్రైవేట్ స్కూళ్లు, మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాన్లు రావ డం, ఇంగ్లిష్‌పై మోజుతో విద్యార్థుల సంఖ్య తగ్గి, మూతబడే స్థితికి వచ్చిన స్కూళ్లు ఉపాధ్యాయుల కృషితో మళ్లీ జీవం పోసుకున్నాయి. పట్టుబట్టి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించి, విస్తృతంగా ప్రచారం చేయడంతో ఆ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. దాతల సహకారంతో ప్రొజెక్టర్ల, గోడలపై జాతీయ నాయకుల చిత్రాలు, ఆంగ్ల పాఠ్యాంశాల పెయింటింగ్స్ ఆకర్షిస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో గోపతండా, పిచ్చిరాంతండా ప్రాథమిక పాఠశాలలు స్థానిక విద్యార్థులతోపాటు చుట్టు పక్కల సుమారు పదితండాల విద్యార్థులతో కళకళలాడేవి. విచ్చలవిడిగా వెలిసిన ప్రైవేట్ పాఠశాలలు, తండాలకు సైతం బస్సులు, వ్యాన్ల రాక, ఇంగ్లిష్‌పై మోజుతో ఆ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. చాలామంది ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చేరారు. దీంతో నాలుగేళ్ల కిందట పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 22కు తగ్గిపోయింది. మూతబడే స్థితికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఆ పాఠశాలల ఉపాధ్యాయులు ఎలాగైనా బడులను బతికించుకోవాలని కంకణం కట్టుకున్నారు. పట్టుబట్టి 2016-17 సంవత్సరంలో ఇంగ్లిష్ మీడియానికి అనుమతులు తెచ్చుకుని ప్రారంభించారు. గోపతండా, పిచ్చిరాంతండాతోపాటు చుట్టు పక్కల తండాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఇంగ్లిష్ మీడియం ప్రారంభం, ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలను తల్లిదండ్రులకు వివరించి చెప్పారు. తమ పిల్లలను సర్కారు బడికే పంపేలా తల్లిదండ్రులను ఒప్పించారు. నాటి నుంచి ఆ రెండు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం పిచ్చిరాంతండా పాఠశాలలో 30మంది, గోపతండాలోని పాఠశాలలో 54మంది విద్యార్థులు ఉన్నారు. కాగా, పిచ్చిరాంతండాలోని 112 కుటుంబాలు ఉండగా, ఒక్కరు కూడా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల కు పంపొద్దని తీర్మానించుకున్నారు.
సౌకర్యాలు మెరుగుపడ్డాయి..
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. విశాలమైన ఆటస్థలం, అధునాతన భవనాలు ఏర్పాటు చేశారు. తండా బడిలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించి తల్లిదండ్రులను వివరించి ఒప్పించాం. గిరిజనులు, పేద విద్యార్థులకు ఉన్నతస్థాయి విద్యందిస్తున్నందుకు గర్వంగా ఉంది.
– గుగులోత్ చంద్రకళ, గోపతండా, ఉపాధ్యాయురాలు
ఇంగ్లిష్ అంటేనే ఇష్టపడుతున్నారు..
ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ ఉండాలన్న సర్కారు నిర్ణయం హర్షణీయం. మా తండా పాఠశాలలో ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం అమలుచేస్తున్నాం. విద్యార్థులకు సులభంగా ఇంగ్లిష్ పాఠాలు అర్థమయ్యేలా ప్రొజెక్టర్ సాయంతో ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. సీఎం కేసీఆర్ సార్ మన ఊరు-మన బడి ద్వారా అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుచేయడం బాగుంది.
– అజ్మీరా లక్ష్మి, సర్పంచ్, గోపతండా
దాతల సహకారంతో..
గోపతండాకు చెందిన సర్పంచ్ అజ్మీరా లక్ష్మితోపాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు, పిచ్చిరాంతండాలో దాతలు, ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలకు రంగులు వేయించారు. జాతీయ నాయకుల ఫొటోలు, ఆంగ్లపాఠాల బొమ్మలను గోడలపై వేయించారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. పిల్లలకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా డీజీ క్లాస్‌ల కోసం ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు.
మా తండా బడిలోనే ఇంగ్లిష్ మీడియం
మా తండా ప్రభుత్వ పాఠశాలలోనే ఐదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో చదుకునే అవకాశం ఉంది. ప్రైవేట్ బడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఐదో తరగతి పూర్తయితే ప్రైవేటుకు వెళ్లాల్సివస్తుందని భయపడ్డాను. ప్రభుత్వమే అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించడంతో ఆ భయం పోయింది.
– అజ్మీరా చరణ్, విద్యార్థి, పిచ్చిరాంతండా