రోజుకో కొత్త శిఖరానికి చేరుతున్న ఎర్రబంగారం ధర
పత్తి క్వింటాల్‌కు రూ.10,720
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రికార్డుస్థాయి ధరలు
కాశీబుగ్గ, మార్చి 21 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, దేశీరకం మిర్చికి రికార్డు స్థాయి ధరలు పలికాయి. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ధరలు పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కర్కపల్లి గ్రామానికి చెందిన రైతు ఓడె లింగేశ్వర్‌రావు 24 బస్తాల దేశీరకం మిర్చిని తీసుకురాగా వెంకటేశ్వర ట్రేడర్స్ అడ్తి ద్వారా లోకేశ్వర ట్రేడర్స్ వ్యాపారి క్వింటాల్‌కు రూ.45వేల ధరతో కొనుగోలు చేశా డు. అదే జిల్లాలోని పెరుకపల్లి గ్రామానికి చెందిన అంకతి రాజ్‌కుమార్ 40 బస్తాల పత్తి తీసుకువచ్చాడు. వేణుగోపాలస్వామి అడ్తి ద్వారా ఓం ప్రకాశ్ కాటన్ వ్యాపారి క్వింటాల్‌కు రూ.10,720 ధరతో కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా అత్యధికంగా వ్యవసాయ ఉత్పత్తులు అమ్మిన రైతులను మార్కెట్ సిబ్బంది అభినందించారు.